Shubman Gill: టీమిండియా కెప్టెన్ గా ఎంపికయ్యాక గిల్ తొలి పలుకులు

Shubman Gill First Words as India Cricket Captain
  • భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ నియామకం
  • రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్ అవ్వడంతో గిల్‌కు ఈ అవకాశం
  • దేశానికి టెస్టుల్లో నాయకత్వం వహించడం గర్వకారణమన్న గిల్
భారత క్రికెట్ టెస్టు జట్టుకు యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్‌గా ఎంపికవడం తెలిసిందే. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో, అతడి స్థానంలో గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును గిల్ నడిపించనుండగా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని సెలెక్టర్లు శనివారం ప్రకటించారు.

ఈ నియామకంపై శుభ్‌మన్ గిల్ తొలిసారిగా స్పందిస్తూ, టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కడం గొప్ప గౌరవమని, అదే సమయంలో ఇదొక పెద్ద బాధ్యత అని అన్నాడు. "చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన ఎవరైనా దేశం కోసం ఆడాలని కలలు కంటారు. కేవలం ఆడటమే కాదు, సుదీర్ఘ కాలం పాటు టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు. ఈ అవకాశం రావడం నిజంగా గర్వకారణం, ఇది చాలా పెద్ద బాధ్యత కూడా" అని బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ చిన్న వీడియోలో గిల్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, గిల్ ప్రగతి, అతనిలోని నాయకత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. "గత ఏడాది కాలంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాం. శుభ్‌మన్‌ను పలుమార్లు గమనించాం. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా అభిప్రాయాలు సేకరించాం. అతను చాలా యువకుడు, అతనిలో మంచి అభివృద్ధి కనిపించింది. అతనే సరైన వ్యక్తి అని ఆశిస్తున్నాం. అతను అద్భుతమైన ఆటగాడు, అతనికి మా శుభాకాంక్షలు. కెప్టెన్లను ఒకటి రెండు పర్యటనల కోసం ఎంపిక చేయం. గత రెండు సంవత్సరాలుగా అతనిలో పురోగతి చూశాం" అని అగార్కర్ వివరించారు.

శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు భారత టెస్టు జట్టులో ఓపెనర్‌గా, మూడో స్థానంలోనూ బ్యాటింగ్ చేశాడు. 32 టెస్టు మ్యాచ్‌లలో 35.1 సగటుతో 1893 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. గతంలో గిల్ జింబాబ్వేలో జరిగిన టీ20ఐ సిరీస్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించి 4-1 తేడాతో సిరీస్ విజయాన్ని అందించాడు. అలాగే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్, తన ప్రశాంతత, వ్యూహాత్మక నైపుణ్యాలతో సహచరులు, కోచింగ్ సిబ్బంది నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.


Shubman Gill
India Cricket
Test Captain
Rohit Sharma
Rishabh Pant
Ajit Agarkar
England Tour
BCCI
Gujarat Titans
Cricket

More Telugu News