Pawan Kalyan: టాలీవుడ్ పెద్దలపై పవన్ కల్యాణ్ ఉగ్రరూపం... అల్లు అరవింద్ ఏమన్నారంటే...!

Pawan Kalyans Reaction on Tollywood Allu Aravind Responds
  • సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు
  • ఏడాదైనా సీఎంను చిత్ర ప్రముఖులు కలవలేదని అసంతృప్తి
  • ఆ నలుగురిలో తాను లేనన్న అల్లు అరవింద్
  • ఆ నలుగురు ఇప్పుడు 10 మంది అయ్యారని వెల్లడి
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా తెలుగు సినిమా పెద్దలు కనీసం మర్యాదకైనా సీఎం చంద్రబాబును కలవలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. గత ప్రభుత్వం నుంచి వేధింపులకు గురైన సినీ రంగాన్ని తమ కూటమి ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుందో మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. సినీ పరిశ్రమ నుంచి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ కు తాము కూడా తగిన రీతిలోనే స్పందిస్తామని పవన్ ఘాటుగా హెచ్చరించారు. 

తాను కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తే కావడంతో టాలీవుడ్ పై ఎప్పుడూ సానుకూలంగా ఉండే పవన్ ఒక్కసారిగా ఉగ్రరూపం ప్రదర్శించడంతో తెలుగు ఇండస్ట్రీలో కలకలం రేగింది. పవన్ 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ కానున్న సమయంలోనే థియేటర్ల మూసివేత నిర్ణయం తీసుకోవడంతో చిత్ర పరిశ్రమలో ఏదో జరుగుతోందన్న వాదనలకు బలం చేకూర్చుతోంది. 

ఈ నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేడు మీడియా ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సాహసం అని విమర్శించారు. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తి... కానీ సినీ పరిశ్రమకు చెందిన ఏ సంస్థకు చెందినవాళ్లు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవలేదని అన్నారు. 

ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు అంటున్నారని... అలాంటప్పుడు గత ప్రభుత్వ పెద్దలను ఎందుకు కలిశారని అల్లు అరవింద్ నిలదీశారు. "మనకు కష్టం వచ్చిందనే కదా అప్పటి ముఖ్యమంత్రిని కలిశారు... మరి ఇవాళ సినీ పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటప్పుడు అందరూ కూర్చుని ఏం చేయాలనేది చర్చించాలి కదా! నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య సమస్యలుంటే చర్చించుకోవాలి" అని హితవు పలికారు. 

రెగ్యులర్ గా జరిగే ఫిలిం ఛాంబర్ సమావేశాలకు తాను వెళ్లనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. అయితే, సినీ పరిశ్రమకు ఏదైనా సమస్య వస్తే తన మద్దతు తప్పకుండా ఉంటుందని అన్నారు. ఆ 'నలుగురి' కబంధ హస్తాల్లో చిత్ర పరిశ్రమ ఉందంటూ ప్రచారం చేస్తున్నారని, ఆ 'నలుగురి'లో తాను లేనని, బయటికి వచ్చేశానని అల్లు అరవింద్ కరాఖండీగా చెప్పారు. ఆ 'నలుగురు' కాస్తా ఇప్పుడు 10 మంది అయ్యారు... వారిలో నన్ను కలపవద్దని మీడియాను కోరుతున్నా అని విలేకరులతో అన్నారు. 

తాను 50 ఏళ్లుగా సినిమాలు తీసే వృత్తిలో ఉన్నానని, తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లీజులో లేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీలో 1,500 థియేటర్లు ఉంటే, అందులో ప్రస్తుతం తనకు 15 మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఆ 15 థియేటర్లను ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వస్తున్నానని అన్నారు. లీజు పూర్తయ్యాక రెన్యువల్ చేయొద్దని మా సిబ్బందికి చెప్పాను అని వివరించారు. థియేటర్ల మూసివేతపై ఏపీ మంత్రి మాట్లాడింది సమంజసమే అనుకుంటున్నానని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. 

థియేటర్లకు సంబంధించి మూడు మీటింగులు జరిగాయని, తాను మాత్రం ఏ మీటింగుకు వెళ్లలేదని, తమ వాళ్లను కూడా వెళ్లొద్దని చెప్పానని వెల్లడించారు. ఒకటో తేదీ నుంచి థియేటర్లు మూసివేస్తామని ఏకపక్షంగా ఎలా అంటారని మండిపడ్డారు. థియేటర్లు మూసివేస్తామని పవన్ కల్యాణ్ ను వారు బెదిరిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Pawan Kalyan
Telugu cinema
Allu Aravind
AP government
theater closures
Tollywood
Chandra Babu
Hari Hara Veera Mallu
film industry issues
movie theaters

More Telugu News