Madhya Pradesh Gang Rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన.. పెళ్లికి వెళ్లిన మహిళపై కామాంధుల ఘాతుకం

Madhya Pradesh Gang Rape Case Nirbhaya like Incident Shocks Nation
  • పెళ్లి వేడుకకు హాజరై, అదృశ్యమైన 45 ఏళ్ల మహిళ
  •  సామూహిక అత్యాచారం, ప్రైవేటు భాగాల్లో ఇనుపరాడ్డుతో దాడి
  •  తీవ్ర గాయాలతో మహిళ మృతి 
  •  పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
మధ్యప్రదేశ్‌లో మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఖండవా జిల్లాలో 45 ఏళ్ల గిరిజన మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి పైశాచికంగా హింసించారు. ఈ అమానుష దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఖండవా జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో శుక్రవారం ఒక వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు బాధితురాలు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరైంది. శుక్రవారం రాత్రి సమయంలో ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు.

శనివారం ఉదయం గ్రామంలోని ఓ ఇంటి వెనుక భాగంలో బాధితురాలు అత్యంత దీనస్థితిలో పడి ఉండటాన్ని కొందరు మహిళలు గమనించారు. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండటం, రక్తస్రావం అవుతుండటంతో వెంటనే  బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లారు. తనపై జరిగిన ఘోరాన్ని వివరించే ప్రయత్నం చేస్తుండగానే ఆమె మృతి చెందింది.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖండవా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించారు. ఆమె శరీరంపై అనేక చోట్ల బలమైన గాయాలున్నాయని, గర్భాశయం కూడా బయటకు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం రోశ్నీ చౌకీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారని సమాచారం.

జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) రాజేశ్‌ రఘువంశీ ఈ ఘటనపై స్పందిస్తూ "మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించాం. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నాం. త్వరలోనే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. ఈ అమానుష ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Madhya Pradesh Gang Rape
Khandwa district
Tribal woman
Nirbhaya case
Sexual assault
Crime against women
Police investigation
Rape and murder
Madhya Pradesh crime
Roshni Chouki police

More Telugu News