Padma: సోషల్ మీడియా సైడ్ ఎఫెక్ట్... యువకుడ్ని పెళ్లాడిన ఇద్దరు పిల్లల తల్లి... ఇద్దరూ ఆత్మహత్య!

Padma and Suresh Suicide After Social Media Affair in Srikalahasti
  • మనస్థాపంతో మహిళ ఆత్మహత్య
  • పురుగు మందు తాగి యువకుడూ మృతి
  • శ్రీకాళహస్తి కైలాసగిరి కాలనీలో ఘటన
సభ్యసమాజం హర్షించని రీతిలో, కామంతో కళ్లు మూసుకుపోయి భర్తను, ఇద్దరు పిల్లలను వదిలి, పాతికేళ్ల యువకుడితో పరారయి పెళ్లి చేసుకున్న 40 ఏళ్ల మహిళ హఠాత్తుగా మరణించారు. ఆమెను పెళ్లి చేసుకున్న యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన శ్రీకాళహస్తి కైలాసగిరి కాలనీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంకు చెందిన పద్మ (40) అనే వివాహితకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుండగా, కుమార్తె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీకి చెందిన సురేశ్ (25) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. సురేశ్ ఓ మొబైల్ షాపులో పని చేసేవాడు. వారి పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ క్రమంలో పద్మ భర్తను, పిల్లలను వదిలి విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తికి వెళ్లిపోయింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను తిరిగి ఇంటికి రప్పించారు. కానీ సురేశ్‌తోనే కలిసి జీవించాలని నిర్ణయించుకున్న ఆమె, గత ఏడాది నవంబర్‌లో ఇంట్లో ఉత్తరం రాసి పెట్టి ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. సురేశ్, పద్మ వివాహం చేసుకున్నారు. అయితే, యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం ఈ వివాహాన్ని అంగీకరించలేదు.

దీంతో సురేశ్, పద్మ కైలాసగిరి కాలనీలో కాపురం పెట్టారు. కొంతకాలం వీరి జీవనం సాఫీగానే సాగింది. అయితే, ఈ నెల 22న పద్మ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా సురేశ్ మరుసటి రోజే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సురేశ్ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, పద్మ మృతదేహం కనిపించింది. పక్కనే సురేశ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. వెంటనే సురేశ్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. టిఫిన్, భోజనం వృథా చేస్తుందని సురేశ్ మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి, పద్మ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు, పద్మ కుమారుడు, కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
Padma
Srikalahasti
social media
suicide
Vishakapatnam
extra marital affair
crime news
love affair
family issues
Andhra Pradesh

More Telugu News