Revanth Reddy: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. ఢిల్లీలోనే రేవంత్‌రెడ్డి

Revanth Reddy to Finalize Telangana Cabinet Expansion in Delhi
  • అందుబాటులో ఉండాలని రేవంత్‌కు అధిష్ఠానం సూచన
  • నేడు రాహుల్, ఖర్గేతో భేటీ 
  • గత రాత్రి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్, మహేశ్‌కుమార్‌ గౌడ్ భేటీ
  • జిల్లాల వారీగా పేర్లు ఖరారు.. రాహుల్, ఖర్గే ఆమోదమే తరువాయి!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకొనేందుకు అందుబాటులో ఉండాలంటూ అధిష్ఠానం పెద్దల నుంచి రేవంత్‌రెడ్డికి సమాచారం అందింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ హైదరాబాద్ తిరిగి చేరుకోవాల్సి ఉండగా, అధిష్ఠానం సూచన మేరకు హస్తినలోనే ఉండిపోయారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్‌రెడ్డి నేడు భేటీ కానున్నారు.

గత రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై కసరత్తు చేసినట్టు తెలిసింది. సామాజికవర్గం, జిల్లాల వారీగా పేర్లను ఎంపిక చేసినట్టు తెలిసింది. అలాగే, ఎమ్మెల్యేల నుంచి తనకు వచ్చిన వినతులను వేణుగోపాల్‌ ముందు రేవంత్ పెట్టినట్టు సమాచారం. వీటన్నింటిపై చర్చించి ప్రాథమికంగా మరోసారి పేర్లను ఖరారు చేశారని, అయితే, వీటికి ఖర్గే, రాహుల్ ఆమోదం తప్పనిసరి కావడంతో వారితో భేటీ అయ్యాక మంత్రివర్గంలోని పేర్లను అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.  

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. 
Revanth Reddy
Telangana Cabinet Expansion
Congress Party
Rahul Gandhi
Mallikarjun Kharge
KC Venugopal
Telangana Ministers
Hyderabad News
Telangana Politics

More Telugu News