Hamdi al-Najjar: పది మంది సంతానంలో తొమ్మిది మంది ఇజ్రాయెల్ దాడిలో మృతి.. గాజాలో కన్నీటి గాథ

Hamdi al Najjar Nine Children Killed in Gaza Airstrike
  • ఖాన్ యూనిస్‌లో వైద్యుడి ఇంటిపై వైమానిక దాడి
  • ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య తండ్రి, కుమారుడు
  • దాడిని ధృవీకరించిన ఇజ్రాయెల్ సైన్యం.. అమాయక పౌరుల మృతిపై దర్యాప్తు
  • గాజాలో 20 నెలలకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో తాజా విషాదం
గాజాలోని ఖాన్ యూనిస్ లో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఒకే కుంటుంబానికి చెందిన తొమ్మిది మంది చిన్నారులు మరణించారు. ఆ కుటుంబంలోని పది మంది సంతానంలో తొమ్మిది మంది మరణించగా తండ్రి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. హమ్ది అల్-నజ్జార్ ఖాన్ యూనిస్ లో వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య ఆలా అల్-నజ్జార్ కూడా వైద్యురాలే. ఈ దంపతులకు పది మంది సంతానం ఉన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం హమ్ది నివాసంపై ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడి చేశాయి. ఆ సమయంలో నజ్జార్ ఆసుపత్రిలో ఉండగా.. పిల్లలతో పాటు హమ్ది ఇంట్లోనే ఉన్నారు. ఇంటిపై బాంబు పడడంతో హమ్ది, మరో కుమారుడు మినహా తొమ్మిది మంది పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు.

హమ్దికి తల, పొట్ట, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని, ఆయనకు రెండు శస్త్ర చికిత్సలు చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచామని చెప్పారు. గాజా వైద్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన పిల్లల వయస్సు ఒకటి నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంది. ప్రాణాలతో బయటపడిన ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దాడి జరిగిన సమయంలో నజ్జార్ భార్య, ఆలా అల్-నజ్జార్ ఇంట్లో లేరు.

ఆమె తన భర్త, కుమారుడు చికిత్స పొందుతున్న అదే ఆసుపత్రిలో, ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన పాలస్తీనియన్లకు వైద్యం అందిస్తున్నారు. "ఆమె తన ఇంటికి వెళ్లి, కాలిపోయిన తన పిల్లలను చూసింది. దేవుడే ఆమెకు ధైర్యాన్నివ్వాలి," అని నజ్జార్ సోదరి తహానీ యహ్యా అల్-నజ్జార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఖాన్ యూనిస్ లో వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. పౌరులను ఖాళీ చేయించిన తర్వాతే ఆపరేషన్‌ ప్రారంభించినట్లు తెలిపింది. ఒక భవనంలో అనుమానితులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని పేర్కొంది. ఈ దాడిలో పౌరులు మరణించినట్లు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.

అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్ దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిలో సుమారు 1,200 మంది మరణించగా, 251 మందిని హమాస్ ఉగ్రవాదులు అపహరించారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యలో ఇప్పటివరకు 53,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని, వారిలో 16,500 మంది చిన్నారులేనని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20 నెలలకు పైగా సాగుతున్న ఈ యుద్ధం కారణంగా గాజాలోని దాదాపు 20 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Hamdi al-Najjar
Gaza
Israel
Khan Younis
Palestine
airstrike
children killed
Hamas
Israel-Hamas war
al-Najjar family

More Telugu News