China Embassy: 'విదేశీ వధువుల కొనుగోలు'పై చైనా ఎంబసీ సీరియస్ వార్నింగ్

China Embassy Issues Warning on Buying Foreign Brides
  • అక్రమ వివాహాలు చేసుకోవద్దంటూ బంగ్లాదేశ్ లోని చైనా యువతకు హితవు
  • సరిహద్దు దాటి పెళ్లిళ్లు చేసుకుంటే చట్టపరమైన చిక్కులు తప్పవన్న చైనా
  • మానవ అక్రమ రవాణా కింద తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం తమ దేశ పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది. అక్రమ పద్ధతుల్లో సరిహద్దులు దాటి వివాహాలు చేసుకోవద్దని, ఆన్‌లైన్ వేదికగా జరిగే పెళ్లిళ్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ నియంత్రణలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. "సరిహద్దు డేటింగ్" వంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని ఎంబసీ సూచించింది. అనధికారిక మార్గాల్లో లేదా వాణిజ్య మ్యాచ్‌మేకింగ్ ఏజెన్సీల ద్వారా "విదేశీ వధువులను" వెతకడం చైనా చట్టాల ప్రకారం నిషేధమని గుర్తుచేసింది. "విదేశీ వధువును కొనడం" అనే ఆలోచనను పూర్తిగా విడనాడాలని, బంగ్లాదేశ్‌లో వివాహం చేసుకునే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని చైనా పౌరులను కోరింది.

చైనాలో ఒకప్పుడు అమలులో ఉన్న ఒకే బిడ్డ విధానం, సాంస్కృతికంగా కొడుకులకే ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో ప్రస్తుతం లింగ అసమానత నెలకొంది. దీనివల్ల సుమారు 30 మిలియన్ల మంది చైనా పురుషులకు వివాహ వయసు వచ్చినా జీవిత భాగస్వామి దొరకడం లేదు. దీనిని అవకాశంగా మలుచుకున్న కొన్ని నేర ముఠాలు, వివాహం పేరుతో బంగ్లాదేశ్ మహిళలను అక్రమంగా చైనాకు తరలిస్తున్నాయని "ది డైలీ స్టార్" పత్రిక ఇటీవల ఒక కథనంలో పేర్కొంది.

ఇలాంటి అక్రమ వివాహాలు తీవ్రమైన, చట్టపరమైన చిక్కులకు దారితీస్తాయని చైనా రాయబార కార్యాలయం హెచ్చరించింది. చైనా చట్టాల ప్రకారం, సరిహద్దు దాటి వివాహ సేవలు అందించే ఏజెన్సీలపై నిషేధం ఉంది. ఎవరైనా లాభాపేక్షతో లేదా మోసపూరితంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ప్రేమ లేదా వివాహ మోసాల బారిన పడిన బాధితులు వెంటనే చైనాలోని ప్రజా భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.

అక్రమ సరిహద్దు వివాహాలు చేసుకున్న వారు మానవ అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టు అయ్యే అవకాశం ఉందని ఎంబసీ తెలిపింది. బంగ్లాదేశ్ యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టం మరియు పీనల్ కోడ్ ప్రకారం, మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇలాంటి కార్యకలాపాలకు సహకరించినా, ప్రోత్సహించినా మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 20,000 టాకా (సుమారు $185) వరకు జరిమానా విధిస్తారు. గతంలో టిక్‌టాక్ వంటి మాధ్యమాలను ఉపయోగించి బంగ్లాదేశ్ మహిళలను పొరుగున ఉన్న భారతదేశంలో లైంగిక వృత్తిలోకి నెట్టిన ఘటనలు కూడా జరిగాయని అల్ జజీరా పేర్కొంది.
China Embassy
Bangladesh
illegal marriage
bride trafficking
human trafficking
cross-border marriage
online dating scams
gender imbalance
China one-child policy
marriage fraud

More Telugu News