Etela Rajender: కవిత ఎపిసోడ్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు

Etela Rajender Comments on Kavitha Episode and KCR Relationship
  • కేసీఆర్ దృష్టిలో నెగెటివ్ గా పడితే ఇక అంతే..
  • ఎవరినైనా టార్గెట్ చేస్తే వారు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వదలరని వెల్లడి
  • ఎదురు చెప్పే వారిని తన సమీపంలోకి రానీయడని వివరణ
  • 20 ఏళ్లు దగ్గరి నుంచి చూశా.. కేసీఆర్ స్వభావం తనకు తెలుసన్న ఈటల 
‘కేసీఆర్ తనను తాను ఓ చక్రవర్తిలా, రాజులా భావిస్తుంటాడు.. ఒక్కసారి ఎవరిపైనైనా ఆయనకు నెగెటివ్ అభిప్రాయం పడితే ఇక అంతే. అది ఎన్నటికీ మారదు. కేసీఆర్ తో కవిత బంధం ఇక అతికే అవకాశమే లేదు’ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కవితల బంధం ఇక ముగిసినట్లేనని ఆయన పరోక్షంగా తేల్చిచెప్పారు. కేసీఆర్ కు ఎదురుచెప్పే వారు ఆ తర్వాత ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరని వివరించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దాదాపు 20 సంవత్సరాలుగా కేసీఆర్ వెన్నంటే ఉన్నానని, ఆయనను చాలా దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా తాను ఈ మాటలు చెబుతున్నానని ఈటల పేర్కొన్నారు.

రాచరికపు పోకడ, నియంతృత్వం, నమ్ముకున్న వారిని నట్టేట ముంచే పద్ధతి, వ్యక్తులను వాడుకుని వదిలేసే నైజం ఫలితమే రాజకీయంగా కేసీఆర్ ను బొందపెట్టిందని ఈటల రాజేందర్ చెప్పారు. కవితకు వాళ్ల కుటుంబానికి మధ్య ఎక్కడో ఏదో తేడా వచ్చిందని ఇక అతికే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎవరినైనా టార్గెట్ చేస్తే మరో పని పెట్టుకోడని, తను టార్గెట్ చేసిన వ్యక్తి అంతుచూసేదాకా వదలడని ఈటల చెప్పారు. అది ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వదలిపెట్టడని అన్నారు. ఒకవేళ అవసరార్థం మళ్లీ దగ్గరికి తీసినా సరే సమయం వచ్చినపుడు తొక్కేస్తాడని తేల్చిచెప్పారు. ఒకసారి విభేదాలు పొడచూపితే వాటిని మర్చిపోయి కలిసి ముందుకు సాగే వ్యక్తి కాదని పేర్కొన్నారు. కూలిపోయే పరిస్థితి వచ్చినా సరే నేనే గొప్ప అనుకునే వ్యక్తి కేసీఆర్ అని ఈటల తెలిపారు. వాస్తవాన్ని అంగీకరించే మూడ్ లో కేసీఆర్ లేరని ఈటల వివరించారు.


Etela Rajender
K Kavitha
KCR
BRS Party
Telangana Politics
Etela Comments
Telangana News
KCR Family
Telangana Elections
BJP

More Telugu News