Pawan Kalyan: కల్యాణ్ గారి సినిమాలు ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవు: దిల్ రాజు

Dil Raju No one dares to stop Kalyan Garus movies
  • జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత అంటూ ప్రచారం 
  • పవన్ కల్యాణ్ సినిమాను అడ్డుకోవడానికే అంటూ ప్రచారం
  • భగ్గుమన్న పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్
  • నేడు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన దిల్ రాజు
జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారంటూ ఇటీవల వార్తలు రావడం, దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం తెలిసిందే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నిన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి తన స్పందన తెలియజేశారు. నేడు, మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యవహారంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత అనేది దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ గారి సినిమాలు ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని అన్నారు. ఎగ్జిబిటర్లకు సంబంధించిన వ్యవహారం పక్కదారి పట్టి, పవన్ కల్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తున్నారు అనే కోణంలో తప్పుడు ప్రచారం జరిగిందని దిల్ రాజు వివరించారు. ఇందులో తన పేరు ప్రత్యక్షంగా ఎక్కడా వినిపించకపోయినా, పరోక్షంగా తన గురించి చర్చించుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారని తెలిపారు. 

పవన్ కల్యాణ్ సినిమా ఆపాలన్న ఆలోచన ఎవరికీ రాదని, సినిమా థియేటర్లు మూసివేయడం అనేది జరగని పని అని స్పష్టం చేశారు. నా 30 ఏళ్ల సర్వీసులో థియేటర్లు మూసివేయడం అనేది ఇప్పటిదాకా చూడలేదు అని అన్నారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి షూటింగులు ఆపుకున్నామే కానీ, ఇలా థియేటర్ల మూసివేత వరకు ఎప్పుడూ వెళ్లలేదని తెలిపారు. ఈ ఎపిసోడ్ అంతా పవన్ సినిమాను అడ్డుకోవడం కోసమే అన్నట్టుగా మారిపోయిందని, ఇదే కోణంలో ప్రభుత్వాలకు కూడా సమాచారం వెళ్లిందని, ఇందులో ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయో కానీ, వారు భక్తితోనే, భయంతోనే తప్పుడు సమాచారం చేరవేశారని దిల్ రాజు ఆరోపించారు. 

ఇదే అంశంలో ఏపీ మంత్రి దుర్గేశ్ గారు తనతో మాట్లాడారని, థియేటర్లు మూసివేయరని ఆయనకు అప్పుడే చెప్పానని వెల్లడించారు. ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించిన జాయింట్ మీటింగ్ లోనే థియేటర్ల అంశంపై స్పష్టత వచ్చిందని, ఈలోపే కొందరు ప్రభుత్వాలకు తప్పుడు సమాచారం అందించడం వల్ల ఇది వివాదం రూపుదాల్చిందని దిల్ రాజు పేర్కొన్నారు. మే 30న భైరవం, జూన్ 5న కమల్ హాసన్ గారి సినిమా, జూన్ 12 పవన్ కల్యాణ్ గారి  సినిమా, జూన్ 20 కుబేర సినిమాలు ఉన్నాయి... జులై, ఆగస్టులో కూడా కొత్త చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా థియేటర్లు మూసివేసుకుంటారా? అని ప్రశ్నించారు. అలా చేస్తే ఎగ్జిబిటర్లకే కదా నష్టం అని అన్నారు. 

సినిమా ప్రదర్శనలకు సంబంధించి పర్సంటేజి విధానం కావాలని ఎగ్జిబిటర్లు ఫిలిం చాంబర్ కు లేఖ ఇచ్చారని, అయితే, ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని మా వాళ్లు భయపడ్డారని దిల్ రాజు వెల్లడించారు. పర్సంటేజి విధానం ఉంటే బాగుంటుందని కొందరు చెప్పారని, అదే సమయంలో పర్సంటేజికి సంబంధించి ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తూర్పు గోదావరి జిల్లాలో సమావేశమయ్యారని తెలిపారు. గత ఆరు నెలలుగా వారికి వస్తున్న రెవెన్యూ గురించి అడిగామని అన్నారు. ఎగ్జిబిటర్లకు ఏం కావాలో అడగడంలో తప్పులేదని తెలిపారు. 
Pawan Kalyan
Dil Raju
Telugu cinema
AP government
Theater closures
Exhibitors
Film industry
Kandula Durgesh
Allu Arvind
Movie releases

More Telugu News