Kandula Durgesh: వంశీ చనిపోతే కూటమి ప్రభుత్వం కూలిపోతుందన్న పేర్ని నానిపై కందుల దుర్గేశ్ ఫైర్

Kandula Durgesh Fires at Perni Nani Over Comments on Vallabhaneni Vamsi Death
  • మనుషుల మరణాలతో రాజకీయ ప్రయోజనాలు ఆశించడం దారుణమన్న దుర్గేశ్
  • పేర్ని నాని మాటలు అవివేకంగా ఉన్నాయని విమర్శ
  • పవన్ సినిమా విడుదల సమయానికే కొందరు వివాదాలు సృష్టిస్తున్నారని మండిపాటు
వైసీపీ నేత వల్లభనేని వంశీ మరణిస్తే కూటమి ప్రభుత్వం కూలిపోతుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సొంత పార్టీ సభ్యులు మరణించినా పర్వాలేదన్న ధోరణిలో వైసీపీ రాజకీయాలు చేయడం దారుణమని మండిపడ్డారు.

మాజీ మంత్రి పేర్ని నాని మాటలు చాలా అవివేకంగా ఉన్నాయని, మనుషులు చనిపోవాలని కోరుకుంటున్నారా? అని మంత్రి దుర్గేశ్ ప్రశ్నించారు. ఒక వ్యక్తి మరణం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం హేయమైన చర్య అని ఆయన అన్నారు. ఏది పడితే అది మాట్లాడితే కుదరదని, ఎక్కడైనా తప్పు జరిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అంతేగానీ వ్యక్తులు చనిపోవాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

సినిమా థియేటర్ల బంద్‌ను కొందరు సినీ ప్రముఖులు తప్పుగా చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలపైనా కందుల దుర్గేశ్ స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా విడుదలయ్యే సమయానికే కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి సినిమా హాళ్లు బంద్ పాటించడం లేదని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తామని హామీ ఇచ్చారు. అయితే, 'మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం' అని కొందరు సినీ పరిశ్రమ వ్యక్తులు చెప్పడాన్ని అహంకారపూరిత వైఖరిగా పరిగణిస్తామని అన్నారు. పవన్ సినిమా విడుదల కాకముందే, మానవత్వం లేకుండా ఆ సినిమా గురించి మాట్లాడటం పేర్ని నాని దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమని విమర్శించారు.
Kandula Durgesh
Perni Nani
Vallabhaneni Vamsi
Andhra Pradesh government
YSRCP
TDP
Janasena
cinema theaters
Pawan Kalyan
political criticism

More Telugu News