YS Jagan Mohan Reddy: వైఎస్సార్ జిల్లా పేరు మారింది.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

YSR Kadapa District Name Restored by AP Government
  • వైఎస్సార్ జిల్లాకు మళ్లీ పాత పేరు
  • 'వైఎస్సార్ కడప జిల్లా'గా మార్పు
  • ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మార్పు
వైఎస్సార్ జిల్లా పేరును 'వైఎస్సార్ కడప జిల్లా'గా పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పునకు సంబంధించి ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తాజాగా జీవో విడుదలైంది.

వివరాల్లోకి వెళితే, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం కడప జిల్లాకు ఆయన జ్ఞాపకార్థం 'వైఎస్సార్ కడప జిల్లా'గా నామకరణం చేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 'కడప' పదాన్ని తొలగించి కేవలం 'వైఎస్సార్ జిల్లా'గా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఈ చర్యపై అప్పట్లో ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జిల్లా చారిత్రక గుర్తింపును తొలగించారనే విమర్శలు వెల్లువెత్తాయి.

గతంలో, చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో జిల్లాలో పర్యటించిన సందర్భంలో, తాము అధికారంలోకి వస్తే జిల్లా పేరును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా ఈ అంశంపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పేర్ల మార్పుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని, 'కడప' అనే పదాన్ని తొలగించి కేవలం వైఎస్సార్ జిల్లాగా మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు.

ప్రజల నుంచి కూడా ఈ విషయమై పలు విజ్ఞప్తులు అందడంతో, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరును తిరిగి 'వైఎస్సార్ కడప జిల్లా'గా మార్చాలనే స్పష్టమైన అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఆమోదం అనంతరం తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
YS Jagan Mohan Reddy
YSR Kadapa District
Andhra Pradesh
Kadapa District Name Change
Nara Chandrababu Naidu
AP Government
YSR District
Andhra Pradesh Politics

More Telugu News