Telangana Rains: తెలంగాణకు చల్లని కబురు: పలు జిల్లాల్లో వర్షాలు

Telangana Rains Several districts receive rainfall
  • తెలంగాణలో ప్రవేశించిన రుతుపవనాలతో చల్లబడిన వాతావరణం
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం, వాహనదారులకు ఇబ్బందులు
  • ఉపరితల ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వానలు
నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. రాష్ట్రంలోని తాజా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కుమరం భీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ రోజు రాత్రి ఏడు గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు, ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి అనేక చోట్ల వాన పడింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆకస్మిక వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Telangana Rains
Telangana Weather
Hyderabad Rains
IMD
Rain Alert
Monsoon

More Telugu News