Dil Raju: దిల్ రాజు వివరణ.. అదే సమయంలో బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ వైరల్

Bandla Ganesh Tweet Sparks Debate During Dil Raju Press Meet
  • మీడియా ముందుకు నిన్న అల్లు అరవింద్, నేడు దిల్ రాజు
  • 'ఆస్కార్ నటులు' అంటూ బండ్ల గణేశ్ సెటైర్
  • దిల్ రాజును ఉద్దేశించేనా అని నెటిజన్ల చర్చ
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యాజమాన్య సమస్యలు, బంద్ ప్రకటనల నేపథ్యంలో నెలకొన్న గందరగోళంపై ప్రముఖ నిర్మాతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తమపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తనకు తెలంగాణలో కేవలం ఒకే ఒక్క థియేటర్, ఆంధ్రప్రదేశ్‌లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. పరిశ్రమలో 'ఆ నలుగురు' అంటూ జరుగుతున్న ప్రచారంలో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే, తాజాగా మరో అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా మీడియా ముందుకు వచ్చి తన వంతు వివరణ ఇచ్చారు.

దిల్ రాజు మాట్లాడుతూ, తెలంగాణలో తనకు కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మొత్తం 370 థియేటర్లలో ఏషియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు వర్గం ఆధీనంలో కేవలం 120 థియేటర్లు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేంత దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం థియేటర్ల వివాదం సద్దుమణిగిందని, ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అయితే, దిల్ రాజు మీడియా సమావేశం జరుగుతున్న సమయంలోనే మరో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. "ఆస్కార్ నటులు, కమలహాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం" అంటూ బండ్ల గణేశ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న తరుణంలో ఈ ట్వీట్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలు దిల్ రాజును ఉద్దేశించే కావొచ్చని పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.
Dil Raju
Telugu cinema
theater issue
Bandla Ganesh
Kandula Durgesh
Allu Aravind
Tollywood
theaters dispute
AP cinematography
Pawan Kalyan

More Telugu News