YS Sharmila: వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినా...!: వైఎస్ షర్మిల

YS Sharmila Responds to YSR Kadapa District Name Change
  • వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చిన కూటమి ప్రభుత్వం
  • నేడు జీవో విడుదల
  • స్వాగతిస్తున్నామన్న షర్మిల 
  • అయితే ఎన్టీఆర్ జిల్లా పేరును కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మార్చాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా కూటమి ప్రభుత్వం మార్చుతూ నేడు జీవో విడుదల చేసింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని వైఎస్ షర్మిల తెలిపారు. దివంగత 
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా కాంగ్రెస్ పార్టీయే పేరు పెట్టిందని ఆమె గుర్తుచేశారు. అయితే, టీడీపీ మహానాడులో వైఎస్ఆర్ పేరు ప్రస్తావించాల్సి వస్తుందనే కారణంతో, కార్యక్రమానికి ఒక్కరోజు ముందు హడావిడిగా జిల్లా పేరు మార్చడం వ్యక్తిగతంగా కొంత బాధ కలిగించిందని ఆమె అన్నారు. అయినప్పటికీ, కడప జిల్లా చరిత్ర, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా షర్మిల కూటమి ప్రభుత్వానికి ఓ సూటి ప్రశ్న సంధించారు. "కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ పేరు మీద కక్ష సాధింపు రాజకీయాలు అజెండా కాదనుకుంటే, పేర్ల మార్పు వెనుక మీకు దురుద్దేశం లేకుంటే, సెంటిమెంట్ ప్రకారం పాత జిల్లా పేర్లు కొనసాగించాలని మీకు కోరిక ఉంటే, విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం" అని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినప్పుడు, ఎన్టీఆర్ జిల్లాను ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మారిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు.

వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డలని, ప్రజల గుండెల్లో ఇద్దరికీ సమాన స్థానం ఉందని షర్మిల అభిప్రాయపడ్డారు. ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా రాజకీయాలు ఆపాదించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమె విజ్ఞప్తి చేశారు. పేర్ల విషయంలో ఎలాంటి వివక్ష చూపకుండా, అందరికీ సమాన గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు.
YS Sharmila
YSR Kadapa district
Andhra Pradesh
YS Rajasekhara Reddy
TDP Mahanadu
Chandrababu Naidu
NTR district
Vijayawada
Congress Party AP

More Telugu News