Vijayasai Reddy: నేను మౌనంగా ఉండడం వాళ్లకు నచ్చడం లేదు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Accuses YSRCP Faction of Plotting Against Him and Jagan
  • అమ్ముడుపోయానన్న జగన్ ఆరోపణలను ఖండించిన విజయసాయిరెడ్డి
  • వైసీపీలోని ఓ కోటరీయే తనపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ
  • కృష్ణ గారి కుటుంబంతో ఉన్న అనుబంధంతోనే ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానని వెల్లడి
  • టీడీ జనార్ధన్‌తో భేటీ యాదృచ్ఛికమేనని స్పష్టీకరణ
  • లిక్కర్ స్కామ్‌లో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన
  • ఈ జన్మలో టీడీపీలో చేరనని వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీకి గానీ, చంద్రబాబుకు గానీ అమ్ముడుపోలేదని, తనపై కావాలనే కొందరు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలోని ఓ కోటరీయే తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని, తనను రెచ్చగొట్టి, పార్టీకి, జగన్‌కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

తాను మౌనంగా ఉండటం వైసీపీలోని ఒక వర్గానికి నచ్చడం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. "నాపై సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను" అని తెలిపారు. తన స్పందన వల్ల జగన్‌కు నష్టం కలగాలని కొందరు కోరుకుంటున్నారని, వారే తనను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. "రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని అభిప్రాయపడ్డారు.

గత నాలుగేళ్లుగా తనను అవమానిస్తున్నారని, తనకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి తనను బలిపశువును చేయాలని ఆ కోటరీ నిర్ణయించుకుందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. "లేని అభాండాల్ని నా నెత్తి మీద మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను" అని అన్నారు. 2011లో తనపై 21 కేసులు వేసుకున్నానని, ఇప్పుడు కూడా జగన్ గారు నేరుగా అడిగి ఉంటే, కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా ఉంటే, సంబంధం లేకపోయినా బాధ్యత తీసుకునేవాడినేమో అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కోటరీయే తనకు వెన్నుపోటు పొడిచిందని, మూడు తరాలుగా వైయస్ కుటుంబానికి సేవ చేసిన తనను, ఆ కోటరీ మాటలు నమ్మి జగన్ పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా?" అని విజయసాయి ప్రశ్నించారు.

ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లడంపై వివరణ
తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనని విజయసాయిరెడ్డి అంగీకరించారు. స్వర్గీయ కృష్ణ గారి కుటుంబంతో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని, తన కుమార్తె వివాహానికి కూడా వారందరూ హాజరయ్యారని గుర్తుచేశారు. అయితే, అదే సమయంలో టీడీ జనార్ధన్ వారి ఇంటికి వస్తున్న విషయం తనకు తెలియదని, తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.

టీడీపీలో చేరికపై, లిక్కర్ స్కామ్‌పై వ్యాఖ్యలు
ఈ జన్మకు తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. "కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేశ్ ను, చంద్రబాబును కలుస్తా కానీ వేరేవాళ్ళతో ఎందుకు చర్చిస్తాను" అని ఆయన అన్నారు. వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులని, ఇప్పుడు కాదని, ఎందుకంటే తాను ఇప్పుడు రాజకీయాల్లో లేనని పేర్కొన్నారు.

లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ, "లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే, ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి, స్కామ్ లేనప్పుడు, నేను ఏం చర్చిస్తాను?" అని ఆయన ప్రశ్నించారు. స్కామ్ గురించి సిట్ విచారణలో ఏ1 గురించి చెప్పానే తప్ప, వేరే ఎవరినీ తాను ప్రస్తావించలేదని విజయసాయిరెడ్డి వివరించారు.
Vijayasai Reddy
YS Jagan
YSRCP
Chandrababu Naidu
TDP
Andhra Pradesh Politics
Liquor Scam
Ghattamaneni Adiseshagiri Rao
Political Conspiracy
Social Media Propaganda

More Telugu News