Manchu Vishnu: విడుదలకు ముందే ‘కన్నప్ప’కు కష్టాలు.. హార్డ్‌డ్రైవ్‌ మిస్సింగ్

Manchu Vishnu Kannappa Movie Hard Drive Missing Before Release
  • ముంబై నుంచి వచ్చిన పార్శిల్‌లో కీలక డేటా
  • ఆఫీస్ బాయ్, ఓ మహిళపై అనుమానాలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత 
  • సినిమాకు నష్టం చేయడానికేనని ఆరోపణ
ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమా విడుదలకు ముందే కష్టాల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని చిత్ర ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఫిలింనగర్‌లో కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ ట్వంట్వీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌. కన్నప్ప సినిమాకు చెందిన ముఖ్యమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ ఇటీవల కొరియర్ ద్వారా ఫిలింనగర్‌‌లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది. ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ పార్శిల్‌ను కార్యాలయంలో పనిచేసే ఆఫీస్‌బాయ్‌ రఘు అందుకున్నాడు. అయితే, ఈ విషయాన్ని ఆయన ఎవరికీ చెప్పకుండా దానిని చరిత అనే మహిళకు ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాతి నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు.

తమ సినిమా ప్రాజెక్టుకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించాలనే దురుద్దేశంతో గుర్తుతెలియని వ్యక్తుల మార్గనిర్దేశంలో రఘు, చరిత ఈ కుట్రకు పాల్పడ్డారని విజయ్‌కుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హార్డ్‌డ్రైవ్ అపహరణ వెనుక ఉన్న వ్యక్తులను, వారి ఉద్దేశాలను కనుగొనే పనిలో నిమగ్నమైనట్టు పోలీసులు వెల్లడించారు.  
Manchu Vishnu
Kannappa Movie
Kannappa
Telugu Movie
Hard Drive Missing
Film Nagar
24 Frames Factory
Theft
Telugu Cinema
Police Complaint

More Telugu News