Pinaka MK-3: చైనా, పాకిస్థాన్‌కు కొత్త టెన్షన్.. అత్యాధునిక రాకెట్ లాంచర్‌ను పరీక్షించనున్న భారత్

Pinaka MK 3 India to Test Rocket Launcher
  • అత్యాధునిక గైడెడ్ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో
  • 120 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించనున్న పినాక ఎంకే-3
  • కేవలం 44 సెకన్లలో భారీ విధ్వంసం సృష్టించగల సామర్థ్యం
  •  ఇప్పటికే ఉన్న లాంచర్లతో ప్రయోగించే వెసులుబాటు
భారత్‌కు పక్కలో బల్లెంలా తయారైన చైనా, పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసే అత్యాధునిక గైడెడ్ రాకెట్ వ్యవస్థను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. పుణెలోని డీఆర్‌డీవోకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ), ఇతర పరిశోధన ప్రయోగశాలలతో కలిసి పినాక ఎంకే-3 అనే మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ (ఎంబీఆర్ఎల్) వ్యవస్థను అభివృద్ధి చేసింది. పినాక సిరీస్‌లో ఇది అత్యాధునిక వెర్షన్. గతంలో ఉన్న ఎంకే-1 (40 కి.మీ. పరిధి), ఎంకే-2 (60-90 కి.మీ. పరిధి), గైడెడ్ పినాక (75-90 కి.మీ. పరిధి) వెర్షన్ల కంటే ఇది అత్యాధునికమైనది.

ప్రత్యేకతలు ఇవే..
పినాక ఎంకే-3 వ్యవస్థ 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలదు. ఇది 250 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. శత్రువుల కమాండ్ సెంటర్లు, బంకర్లు, సరఫరా కేంద్రాలను నాశనం చేయడానికి ఇది సరిపోతుంది. ఈ రాకెట్ వ్యాసం 300 మిల్లీమీటర్లు. ఇది పాత 214 మిల్లీమీటర్ల వెర్షన్ కంటే పెద్దది. దీనివల్ల ఎక్కువ ఇంధనం, అధునాతన గైడెన్స్ వ్యవస్థలను అమర్చడానికి వీలవుతుంది. ఫలితంగా దీని పరిధి, పనితీరు పెరుగుతాయి.

ఈ వ్యవస్థలో డీఆర్‌డీవోకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) అభివృద్ధి చేసిన హైటెక్ గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ (జీఎన్‌సీ) కిట్‌ను ఉపయోగించారు. ఇందులో లేజర్-గైరో నావిగేషన్, మైక్రోస్ట్రిప్ యాంటెనాలు ఉన్నాయి. ఇవి 10 మీటర్ల కంటే తక్కువ సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ (సీఈపీ)తో అత్యంత కచ్చితత్వాన్ని అందిస్తాయి. పాత ఎంకే-1 సీఈపీ సుమారు 500 మీటర్లు ఉండేది.

పినాక ఎంకే-3ని ఇప్పటికే ఉన్న పినాక లాంచర్ల నుంచే ప్రయోగించవచ్చు. ఇది అదనపు ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి లాంచర్ 8 గైడెడ్ రాకెట్లను మోసుకెళ్లగలదు. కేవలం 44 సెకన్లలో 700×500 మీటర్ల ప్రాంతంలో విధ్వంసం సృష్టించగలదు. పినాక ఎంకే-3 అభివృద్ధి కీలక సమయంలో జరిగింది. చైనాకు చెందిన పీహెచ్ఎల్-03 (పరిధి: 70–130 కి.మీ.), పాకిస్థాన్‌కు చెందిన ఏ-100 (పరిధి: 120 కి.మీ.) దూరశ్రేణి రాకెట్ వ్యవస్థలు భారతదేశాన్ని తన సామర్థ్యాలను పెంచుకోవడానికి పురికొల్పాయి. ఈ ముప్పులను ఎదుర్కోవడానికి 2021లో భారత సైన్యం పినాక వ్యవస్థ 120 కి.మీ., 300 కి.మీ. రేంజ్ వేరియంట్‌లకు ఆమోదం తెలిపింది. 
Pinaka MK-3
DRDO
Multi Barrel Rocket Launcher
MBRL
Guided Rocket System
India China
India Pakistan
ARDE
Defence Research
ракетная система

More Telugu News