Aamir Khan: థియేట‌ర్‌ త‌ర్వాత నేరుగా యూట్యూబ్‌కి.. ఆమిర్ ఖాన్ సంచలన నిర్ణయం

Aamir Khan to Release Sitare Zameen Par Directly on YouTube After Theaters
  • ఆమిర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆర్ఎస్ ప్ర‌స‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ‘సితారే జమీన్ పర్’ 
  • థియేట‌ర్ల‌లోకి విడుద‌లైన 8 వారాల త‌ర్వాత నేరుగా యూట్యూబ్‌లోకి మూవీ
  • పే-పర్-వ్యూ మోడల్‌లో ఇది ప్రేక్ష‌కుల‌కు యూట్యూబ్‌లో అందుబాటులోకి
  • సాధారణంగా సినిమాలు థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీల్లోకి 
  • ఆమిర్ ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టడంతో ఇప్పుడు బాలీవుడ్‌లో చ‌ర్చ
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్ తన తదుపరి చిత్రం ‘సితారే జమీన్ పర్’ విషయంలో ఓ సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీని థియేటర్లలో విడుదలైన తర్వాత, నేరుగా యూట్యూబ్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్న‌ట్లు తెలుస్తోంది. థియేట‌ర్ల‌లోకి విడుద‌లైన ఎనిమిది వారాల త‌ర్వాత దీన్ని నేరుగా యూట్యూబ్‌లోకి తీసుకురానున్నార‌ట‌. పే-పర్-వ్యూ (Pay-per-view) మోడల్‌లో ఇది ప్రేక్ష‌కుల‌కు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  దీంతో ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్ష‌కులు యూట్యూబ్‌లో కొంత రుసుము చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది.

సాధారణంగా సినిమాలు థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌ వంటి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతాయి. అయితే, ఆమిర్ ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, నేరుగా అంద‌రికి అందుబాటులో ఉన్న యూట్యూబ్‌లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించడం బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వినూత్న విధానం ప్రేక్షకులకు ఎంతవరకు చేరువవుతుందో వేచి చూడాలి. ఇక‌, దీని డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ఓటీటీ సంస్థ‌ల‌కు ఆమిర్‌ విక్ర‌యించ‌లేద‌ని, దానికి కార‌ణం మూవీ థియేట‌ర్ త‌ర్వాత నేరుగా యూట్యూబ్‌కి రానుందని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. 

కాగా, ఆమిర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆర్ఎస్ ప్ర‌స‌న్న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన స్పోర్ట్స్ డ్రామా అయిన ‘సితారే జమీన్ పర్’ను 2018లో వ‌చ్చిన స్పానిష్ చిత్రం ఛాంపియ‌న్స్ ఆధారంగా రూపొందించారు. జూన్ 20న విడుద‌ల అవుతున్న ఈ సినిమాలో జెనీలియా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ఈ చిత్రానికి దివ్య నిధి శ‌ర్మ క‌థ అందించారు.  


Aamir Khan
Sitare Zameen Par
YouTube
OTT platforms
Bollywood
RS Prasanna
Genelia D'Souza
Pay-per-view
Champions movie
Divya Nidhi Sharma

More Telugu News