L&T: మేడిగడ్డ బ్యారేజీ రిపోర్టుపై ఎల్ అండ్ టీ సంచలన లేఖ

LT Responds to Medigadda Barrage Failure Report
  • సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజ్ ఫెయిలైందని ఎలా నిర్ణయించారని ప్రశ్న
  • క్వాలిటీ కంట్రోల్ పాటించలేదనే ఆరోపణలపైనా కంపెనీ మండిపాటు
  • బ్యారేజీ పునరుద్ధరణ గురించి ఇది వరకే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వివరణ
మేడిగడ్డ బ్యారేజీ ఫెయిలైందంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డీఎస్ఏ) ఇచ్చిన నివేదికపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మండిపడింది. బ్యారేజీ నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ పాటించలేదనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఎలాంటి సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజ్ ఫెయిలైందని ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. ఈ మేరకు తాజాగా ఎల్ అండ్ టీ ఓ లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్ డీఎస్ఏ ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు తేల్చిచెప్పింది. మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కీలక రిపోర్డును ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై తాజాగా ఎల్ అండ్ టీ స్పందిస్తూ లేఖ రాసింది.

ఎన్ డీఎస్ఏ నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ప్రకారం.. బ్యారేజీ పనితీరును, దెబ్బతినడానికి కారణాన్ని తెలుసుకోవాలంటే తగిన సాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే, మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి సాంకేతిక పరీక్షలు నిర్వహించలేదు. గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు చేయలేదని ఎన్ డీఎస్ఏ నివేదికలో పలుచోట్ల స్పష్టం చేసింది. అలాంటపుడు బ్యారేజీ ఫెయిలైందని ఎలా నిర్ణయించారని ఎల్ అండ్ టీ ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన బ్యారేజీ విఫలమైందని నివేదిక ఇచ్చారని నిలదీసింది. నివేదికలోని 283వ పేజీలో క్వాలిటీ కంట్రోల్ కు సంబంధించిన నివేదికను ఎల్ అండ్ టీ సమర్పించిందని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. అయితే, అదే నివేదికలో పలుచోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ప్రస్తావించడం అసంబద్ధమని అన్నారు. బ్యారేజీ పునరుద్ధరణ గురించి ఇదివరకే ఒకసారి ఎన్ డీఎస్ఏతో పాటు రాష్ట్ర నీటి పారుదుల శాఖకు లేఖలు రాసినట్లు గుర్తు చేసింది.
L&T
Medigadda Barrage
National Dam Safety Authority
NDSA
Telangana
Barrage Failure
Quality Control
Irrigation Department
Dam Safety
Engineering

More Telugu News