Nara Lokesh: పార్టీ భవిష్యత్తు కోసం ఆరు కీలక శాసనాలను ప్రతిపాదించిన నారా లోకేశ్

Nara Lokesh Proposes Six Key Principles for TDPs Future
  • కాలానుగుణంగా పార్టీలో విధానపరమైన మార్పులు తీసుకురావాలన్న లోకేశ్
  • తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అన్న లోకేశ్
  • సరికొత్త  ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చిందని వెల్లడి
"కాలం మారుతోంది... ప్రజల అవసరాలు మారుతున్నాయి... వారి ఆలోచన విధానం కూడా మారుతోంది... పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా కీలక విధానపరమైన మార్పులు తీసుకురావాలి" అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. దీనికోసం ఆరు ధర్మసూత్రాలను తాను ప్రతిపాదిస్తున్నానని పేర్కొన్నారు. 

"అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం నినాదం నియంతృత్వాన్ని తరిమేసింది. చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదం తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది పడింది. ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో సరికొత్త  ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చింది" అని లోకేశ్ తెలిపారు. దీనికోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నానని చెప్పారు.  

లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు:

1) తెలుగుజాతి విశ్వఖ్యాతి: దేశం దేశంలో తెలుగుదేశం వల్లే తెలుగువారికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంది. ఒకనాడు అన్న ఎన్టీఆర్ ను బర్త్ రఫ్ చేస్తే డిల్లీ మెడలు వంచి మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అదీ తెలుగుజాతి పౌరుషం. తెలుగువారిని ప్రపంచ పటంలో పెట్టింది మన చంద్రన్న. అన్నిరంగాల్లో మన తెలుగువారే ముందుండాలి. దీనినే అజెండాగా పెట్టుకొని మనం పనిచేయాలి. 

2) యువగళం: తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేయబోతున్నాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తాం, పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం. యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. మనరాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు ఇస్తే దూసుకుపోతారు. అన్నిరంగాల్లో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే మన లక్ష్యం. 

3) స్త్రీ శక్తి: అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా మహిళలను అవమానించారు. సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి రోడ్డుపైకి గెంటేశారు. రానున్నరోజుల్లో మహిళలను మరింత బలోపతం చేసేందుకు స్త్రీ శక్తిద్వారా మనం కృషిచేయాలి. పార్టీ పదవుల దగ్గర్నుంచి అన్నిరంగాల్లో మహిళలకు సమాన బాధ్యత, భద్రత కల్పించాలి. గాజులు తొడ్డుకున్నావా, చీరకట్టుకున్నావా, ఆడపిల్లలా ఏడవొద్దు లాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మహిళా మంత్రి నాకు చీర, గాజులు పంపిస్తా అన్నారు. అవి పంపిస్తే నా అక్కచెల్లెమ్మలకు కానుకగా ఇచ్చి కాళ్లు మొక్కుతానని చెప్పాను.

4) పేదల సేవలో – సోషల్ రీఇంజనీరింగ్: పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలీచాలని పెన్షన్ 5 రెట్లు పెంచి 200 నుంచి 1000 రూపాయలు చేసింది, వెయ్యి నుంచి 2వేలు చేసింది మన చంద్రబాబు గారు. ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కుటుంబాలకు సామాజిక సమన్యాయం అందుకే ప్రతివారికి న్యాయం చేసేలా సోషల్ రీఇంజనీరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

5) అన్నదాతకు అండగా: రైతు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన పార్టీ తెలుగుదేశం. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. చేయూతనందిస్తే మన రైతులు బంగారం పండిస్తారు. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని అమలుచేయాలి. 

6) కార్యకర్తే అధినేత: ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్పూర్తి. ఆనాడు పుంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత తొడగొట్టి మీసాలు మెలేసి నామినేషన్ వేసి చూపించారు. ప్రత్యర్థుల దాడిలో రక్తం కారుతున్న భయపడకుండా బూత్ లో నిలబడింది మన అక్క మంజుల. తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువ. నడివీధిలో కత్తి గొంతుపై పెట్టి ఒక్కసారి వారి నాయకుడికి జై చెప్పమంటే... జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడు చంద్రయ్య. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలే మన బలం, బలగం. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా కోటిమంది కుటుంబసభ్యులు మనకి ఉన్నారు. కార్యకర్తలను ఆదుకోవడానికి, వారు సొంత కాళ్లపై నిలబడేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Nara Lokesh
TDP
Telugu Desam Party
Mahanadu
Andhra Pradesh Politics
Youth Empowerment
Women Empowerment
Social Re-engineering
Farmers Support
Party Activists

More Telugu News