Karnataka: ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు.. కార‌ణ‌మిదే!

BJP MLAs ST Somashekhar A Shivaram Hebbar Face Expulsion
  • కర్ణాటక ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బార్‌లపై వేటు
  • ఇద్ద‌రిని 6 ఏళ్లపాటు బహిష్కరించిన బీజేపీ
  • పార్టీ నియమాలను ఉల్లంఘించారనే కారణంతో వారిపై బీజేపీ అధిష్ఠానం చ‌ర్య‌లు
కర్ణాటకకు చెందిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ నియమాలను ఉల్లంఘించారనే కారణంతో బీజేపీ అధిష్ఠానం వారిపై వేటు వేసింది. ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, ఎ. శివరామ్‌ హెబ్బర్‌ల‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన కేంద్ర క్రమశిక్షణ కమిటీ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈరోజు వరకు వాళ్లు పార్టీకి సంబంధించిన ఏ పదవిలో ఉన్నా ఆ పదవులన్నింటి నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.

పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ కార్యదర్శి ఓం పాఠక్ జారీ చేసిన లేఖలో.. ఈ ఏడాది మార్చి 25న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పార్టీ షాకాజ్‌ నోటీసులు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఆ నోటీసులకు వారు సమాధానాలు ఇచ్చారని.. అయితే, వారి వివరణలు సంతృప్తికరంగా లేవని కమిటీ భావించి, తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వారు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారని, దానిపై షాకాజ్‌ నోటీసు ఇచ్చినా వారి నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని, అందుకే ఆ ఇద్దరిపై బహిష్కరణ వేటు వేశామని పేర్కొన్నారు.

కాగా, ఈ బహిష్కరణపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ క‌మిటీ చేప‌ట్టిన క్రమశిక్షణా చర్యను ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఇక‌, సోమశేఖర్ యశ్వంత్‌పూర్, హెబ్బార్ యల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Karnataka
BJP MLAs expelled
ST Somashekhar
Karnataka BJP
A Shivaram Hebbar
Karnataka politics
Rajya Sabha elections
DK Shivakumar
Yashwanthpur
Yellapur

More Telugu News