Virat Kohli: నేడు ల‌క్నోతో ఆర్‌సీబీ మ్యాచ్‌.. మరో రెండు ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డులకు చేరువ‌లో కోహ్లీ

Virat Kohli Approaching IPL Records in RCB vs LSG Match
  • ల‌క్నో వేదిక‌గా ఆర్‌సీబీ, ఎల్ఎస్‌జీ చివ‌రి లీగ్ మ్యాచ్‌
  • మ‌రో హాఫ్ సెంచ‌రీ చేస్తే.. కోహ్లీ పేరిట‌ ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక అర్ధ శ‌త‌కాల రికార్డు
  • ప్ర‌స్తుతం 62 హాఫ్ సెంచ‌రీల‌తో స‌మంగా ఉన్న వార్న‌ర్‌, విరాట్‌
  • మ‌రో 24 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 9వేల ర‌న్స్‌ చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ
ఐపీఎల్‌-2025 సీజన్ లీగ్ ద‌శ ఇవాళ్టితో ముగియ‌నుంది. ల‌క్నో వేదిక‌గా జ‌రిగే చివ‌రి లీగ్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ), లక్నో సూపర్‌ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తలపడనున్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన లక్నో.. ఈ సీజన్‌ను విజయంతో ముగించాలని భావిస్తుంటే.. అదే సమయంలో లక్నోపై గెలిచి పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలువాలని ఆర్‌సీబీ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ప్రస్తుతం ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. ఒక‌వేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. పంజాబ్‌తో క్వాలిఫ‌య‌ర్‌-1లో త‌ల‌ప‌డుతుంది. ఓడితే ముంబ‌యితో ఎలిమినేట‌ర్ ఆడాల్సి వ‌స్తుంది. 

ఇదిలాఉంటే... ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ పలు రికార్డులకు చేరువయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్‌ వార్నర్‌, విరాట్‌ కోహ్లీ ప్ర‌స్తుతం స‌మంగా ఉన్నారు. ఈ ఇద్దరు ఇప్పటి వరకు 62 సార్లు ఐపీఎల్‌లో అర్ధ శ‌త‌కాలు నమోదు చేశారు. లక్నోతో మ్యాచ్‌లో ర‌న్ మెషీన్‌ హాఫ్‌ సెంచరీ చేస్తే... వార్నర్‌ను అధిగమించి ఐపీఎల్‌లో అత్య‌ధిక‌ హాఫ్ సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా రికార్డుకెక్కుతాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ ఆడుతున్న‌ ప్లేయ‌ర్ల‌లో 46 హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ మాత్రమే కోహ్లీకి దగ్గరగా ఉన్నాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే
విరాట్ కోహ్లీ-62
డేవిడ్ వార్నర్ - 62
శిఖర్ ధావన్ - 51
రోహిత్ శర్మ- 46
కేఎల్ రాహుల్- 40
ఏబీ డివిలియర్స్ - 40

చరిత్ర సృష్టించడానికి 24 పరుగుల దూరంలో కింగ్‌ కోహ్లీ 
అలాగే ఇవాళ్టి మ్యాచ్‌లో కోహ్లీ మ‌రో 24 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 9 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఆర్‌సీబీకి ఆడుతున్న విరాట్ ఇప్ప‌టివ‌ర‌కు 270 ఇన్సింగ్స్‌లో 8,976 ప‌రుగులు చేశాడు. ఇందులో 14 ఛాంపియ‌న్స్ లీగ్ టీ20ల్లో 424 ప‌రుగులు చేయ‌గా.. ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్‌ల్లో 8,552 ప‌రుగులు చేశాడు. 

ఇక‌, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచులాడిన అత‌డు 548 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంతకు ముందు 2016లో అత్య‌ధికంగా 11 అర్ధ శ‌త‌కాలు బాదాడు. 
Virat Kohli
RCB vs LSG
IPL 2025
Royal Challengers Bangalore
Lucknow Super Giants
IPL Records
David Warner
Rohit Sharma
IPL Half Centuries
T20

More Telugu News