NVSS Prabhakar: కేసీఆర్ కుటుంబంలో మరో సంచలనం.. కవిత మరో షర్మిల అవుతారు: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

NVSS Prabhakar Comments Kavitha Will Become Another Sharmila
  • కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయన్న బీజేపీ నేత ప్రభాకర్
  • పార్టీలతో కుదిరిన డీల్ బయటపడిందనే కవిత ఆందోళన చెందుతున్నారని ఆరోపణ
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపణ
  • రాబోయే ఆరు నెలలు తెలంగాణకు, బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అత్యంత కీలకమని వ్యాఖ్య
ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాసిన అంశంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో త్వరలో మరో సంచలనం చోటుచేసుకోనుందని ఆయన అన్నారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరాయని, కవిత భవిష్యత్తులో మరో షర్మిలగా మారే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు.

"కవిత బాధ... తాను కేసీఆర్‌కు రాసిన లేఖ బయటపడిందని కాదు... రాజకీయ పార్టీలతో రహస్యంగా కుదిరిన ఒక ఒప్పందం బహిర్గతమైందనేదే ఆమె అసలు ఆవేదన" అని ప్రభాకర్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడుకోవడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, ఇరు పార్టీల నేతల మధ్య రాజీ కుదిరిందని ఆయన ఆరోపించారు. ఈ రహస్య ఒప్పందం విషయం ఎలా బయటకు పొక్కిందనే అంశంపై కేసీఆర్ కుటుంబంలోని నలుగురు కీలక సభ్యుల మధ్య తీవ్రంగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

"రాబోయే ఆరు నెలల కాలం తెలంగాణ రాష్ట్రానికి, అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత కీలకం కానుంది" అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నిజ స్వరూపాలను ప్రజల ముందుంచుతామని, వారి బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు.
NVSS Prabhakar
KCR
Kalvakuntla Kavitha
BRS Party
Telangana Politics
Congress Party

More Telugu News