Pawan Kalyan: టీడీపీ మహానాడుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్

Pawan Kalyan comments on TDP Mahanadu
  • మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అని అభివర్ణన
  • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు ప్రత్యేక అభినందనలు
  • మహానాడులోని ఆరు శాసనాలు ప్రశంసనీయమని వెల్లడి
తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించే మహానాడు చారిత్రక రాజకీయ వేడుక అని, అలాంటి పండుగ వాతావరణంలో నేడు (మంగళవారం) కడపలో ప్రారంభమైన మహానాడుకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ లకు పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి సేవలందిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులుకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

మహానాడు... ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Pawan Kalyan
TDP Mahanadu
Telugu Desam Party
Chandrababu Naidu
Nara Lokesh
Janasena Party
Andhra Pradesh Politics
Kadapa
Political Event
Palla Srinivas

More Telugu News