BSF: 'విధ్వంసక్' దెబ్బకు పాక్ బెంబేలు: ఆపరేషన్ సిందూర్‌లో కీలక ఆయుధం

BSF Operation Sindoor Pakistan Posts Destroyed
  • ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌కు చెందిన 72 పోస్టుల ధ్వంసం
  • 47 వ్యూహాత్మక ప్రాంతాలను కూడా నాశనం చేసిన బీఎస్ఎఫ్
  • ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని భద్రతా దళాల వెల్లడి
  • దేశీయ ఆయుధం 'విధ్వంసక్‌'తో శత్రు స్థావరాలపై దాడులు
  • నిమిషానికి 1000 రౌండ్ల మెషిన్‌గన్‌తో పాక్‌కు దీటైన జవాబు
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో బీఎస్ఎఫ్ కూడా కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ, వారి సైనిక స్థావరాలకు బీఎస్ఎఫ్ తీవ్ర నష్టం కలిగించింది. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన 72 పోస్టులను, 47 వ్యూహాత్మక ప్రాంతాలను ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది.

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్థాన్ వైపు నుంచి మన గ్రామాలపైకి వచ్చిన డ్రోన్లు, క్షిపణులను భారత దళాలు నిర్వీర్యం చేశాయి. అదే సమయంలో, శత్రువుల స్థావరాలు, టవర్లు, బంకర్లే లక్ష్యంగా దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన కీలకమైన సైనిక నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. పాకిస్థాన్‌ను నమ్మలేమని, ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని బీఎస్ఎఫ్ స్పష్టం చేసింది. చొరబాటుదారుల నుంచి ముప్పు ఎక్కువగా ఉన్నందున అంతర్జాతీయ సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉన్నామని తెలిపింది.

జమ్ములోని బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్‌లో నిర్వహించిన ఆయుధాల ప్రదర్శనలో, ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన ఆయుధాల గురించి అధికారులు వివరించారు. వీటిలో దేశీయంగా అభివృద్ధి చేసిన ‘విధ్వంసక్’ యాంటీ మెటీరియల్ రైఫిల్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు.

దేశీయంగా తయారైన ‘విధ్వంసక్’ ఒక యాంటీ మెటీరియల్ రైఫిల్. దీని పరిధి 1300 మీటర్ల నుంచి 1800 మీటర్ల వరకు ఉంటుంది. అవసరాన్ని బట్టి దీని బ్యారెల్స్, బోల్టులు, మ్యాగజైన్లను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఒక్కో మ్యాగజైన్‌లో మూడు రౌండ్ల బుల్లెట్లు ఉంటాయి. ఈ రైఫిల్ శత్రువుల రహస్య ప్రదేశాలు, బంకర్లు, ట్యాంకర్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా నాశనం చేయగలదని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను ఈ ఆయుధం విజయవంతంగా ఛేదించిందని వారు వెల్లడించారు.

ఆపరేషన్‌లో ఉపయోగించిన మరో శక్తివంతమైన ఆయుధం ఆటోమేటిక్ గ్రెనేడ్ సిస్టమ్‌తో పనిచేసే మీడియం మెషిన్‌గన్. 12.7 ఎంఎం యాంటీ-క్రాఫ్ట్ సామర్థ్యం కలిగిన ఈ ఆయుధాన్ని ఆపరేట్ చేయడానికి ముగ్గురు సిబ్బంది అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఇది నిమిషానికి 650 నుంచి 1000 రౌండ్ల వరకు కాల్పులు జరపగలదు. దీని పేలుడు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, గ్రెనేడ్ పడిన చోట 10 మీటర్ల పరిధిలోని వ్యక్తులను చంపగలదని వివరించారు.

"ఇటీవలి ఆపరేషన్‌లో పాక్ దాడులను ఎదుర్కోవడానికి దీన్ని ఉపయోగించాం. దీంతోనే పాక్ అబ్జర్వేషన్ ఔట్‌పోస్టును ధ్వంసం చేశాం. ఈ ఆయుధంతో శత్రుమూకలు సరిహద్దు నుంచి తోకముడిచాయి" అని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
BSF
Operation Sindoor
Vidhwansak
Pakistan
Border Security Force
Anti Material Rifle

More Telugu News