Achchennaidu: మేం కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి... ఉంటాం కూడా!: మంత్రి అచ్చెన్నాయుడు

Achchennaidu Always Indebted to Party Workers
  • టీడీపీ 44వ వసంతంలోకి, కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి
  • వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం
  • గత వైసీపీ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శ
  • ధాన్యం కొని 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశాం
  • రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం
  • సాగులో ఆధునిక టెక్నాలజీ, డ్రోన్ల వినియోగానికి ప్రోత్సాహం
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికే కట్టుబడి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కడపలో మంగళవారం నాడు ప్రారంభమైన మహానాడు వేదికపై ఆయన ప్రసంగిస్తూ, పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ ఏట అడుగుపెట్టిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల అలుపెరుగని కృషి, త్యాగాల వల్లే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి... ఉంటాం కూడా అని స్పష్టం చేశారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. "గత ప్రభుత్వంలో రైతుకు గిట్టుబాటు ధర లేదు, పంట కొనేవారు లేరు. ఒకవేళ కొన్నా ఆరు నెలలైనా డబ్బులు అందేవి కావు" అని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలపై దృష్టి సారించిందని, ధాన్యం కొనుగోలు చేసి రూ.1,671 కోట్ల పాత బకాయిలు తీర్చడమే కాకుండా, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొని 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని వివరించారు. ఇది రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న గౌరవానికి నిదర్శనమని కొనియాడారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. "తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి, దానికి ప్రభుత్వాలు అండగా నిలవాలి. గత ఐదేళ్లలో సాయిల్ టెస్టులు లేవు, యంత్ర పరికరాలు ఇవ్వలేదు, బిందు, తుంపర సేద్యం ఊసే లేదు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించలేదు, పంటల బీమా లేదు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకున్న పాపాన పోలేదు," అని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ఏడాదిలోనే వ్యవసాయంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చామని, వరిపైనే ఆధారపడటం రైతుకు మేలు చేయడం లేదని గుర్తించి, ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దారని తెలిపారు. రాష్ట్రంలో 24 పంటలను 11 క్లస్టర్లుగా విభజించామని, రాయలసీమలో 9 పంటలకు ప్రాధాన్యత ఇచ్చామని, భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

రాయలసీమలో సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నందున, 2014-19 మధ్య కాలంలో డ్రిప్ ఇరిగేషన్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించామని, అయితే గత ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని అచ్చెన్నాయుడు అన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే డ్రిప్ ఇరిగేషన్‌ను పునరుద్ధరించి అభివృద్ధి చేశామని, నేడు దేశంలోనే డ్రిప్ ఇరిగేషన్ వినియోగంలో రాయలసీమ మొదటి స్థానంలో ఉందని గర్వంగా ప్రకటించారు. యంత్ర పరికరాలు అందించే కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించామని, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్ని, ముఖ్యంగా డ్రోన్ల ద్వారా సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇటీవల మిర్చి, పొగాకు, కోకో, మామిడి రైతులకు నష్టం వాటిల్లినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వ్యవసాయమే మేలని భావించేలా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు రూపొందిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Achchennaidu
Andhra Pradesh
TDP
Chandrababu Naidu
Agriculture
Rayalaseema
Farmers welfare
Irrigation
Mahanadu
Nara Lokesh

More Telugu News