Mark Cuban: టెస్లా కంటే కియా కారే మేలంటున్న బిలియనీర్!

Mark Cuban Prefers Kia EV6 Over Tesla
  • టెస్లాను కాదని కియా ఈవీ6 కారునే ఇష్టపడతానన్న మార్క్ క్యూబన్
  • కియాలో టర్న్ సిగ్నల్ వాడకం సులభంగా ఉండటమే ప్రధాన కారణమని వెల్లడి
  • తండ్రి కియా కారు "నర్డ్ కార్" అంటూ వ్యాఖ్యానించిన క్యూబన్ కుమారుడు
  • ఎలాన్ మస్క్ చాలా సున్నిత మనస్తత్వం కలవాడని క్యూబన్ విమర్శ
  • మస్క్‌ను రెచ్చగొట్టడం తనకు సరదాగా ఉంటుందని చెప్పిన క్యూబన్
టెక్నాలజీ రంగంలో ప్రముఖ ఇన్వెస్టర్, బిలియనీర్ మార్క్ క్యూబన్ తన కార్ల ఎంపిక విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఖరీదైన టెస్లా కారు ఉన్నప్పటికీ, దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ తయారుచేసిన ఈవీ6 ఎలక్ట్రిక్ కారు నడపడానికే తను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.

'యువర్ మామ్స్ హౌస్' అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మార్క్ క్యూబన్‌ను 'మీకు బాగా ఇష్టమైన కారు ఏది?' అని ప్రశ్నించగా, ఆయన నవ్వుతూ "కియా ఈవీ6" అని బదులిచ్చారు. "నాకు ఆ కారు అంటే ఇష్టం. చాలా సౌకర్యవంతంగా ఉంటుంది" అని తెలిపారు. తన వద్ద ఉన్న టెస్లా కారును ఇంకా అమ్మేయలేదని స్పష్టం చేస్తూనే, టెస్లాలోని టర్న్ సిగ్నల్ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు. "టెస్లాలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టర్న్ సిగ్నల్ కోసం వెతికి మరీ బటన్ నొక్కాల్సి ఉంటుంది. దీనివల్ల రోడ్డుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించడం కొంచెం కష్టమవుతుంది" అని వివరించారు. కియా కారును మెచ్చుకుంటూ, "కియా మరీ ఆర్భాటంగా ఉండటానికి ప్రయత్నించదు. దాని టర్న్ సిగ్నల్.. చాలా సాధారణంగా, సులువుగా వాడేలా ఉంటుంది" అని క్యూబన్ పేర్కొన్నారు.

అయితే, మార్క్ క్యూబన్ సాపేక్షంగా తక్కువ ధర కలిగిన కియా ఈవీ6 కారును ఇష్టపడి నడుపుతున్నప్పటికీ, ఆయన 15 ఏళ్ల కుమారుడికి మాత్రం అది అంతగా నచ్చడం లేదట. డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆ కారును ఇస్తానని క్యూబన్ చెప్పగా, "డాడ్, అది ఏమాత్రం కూల్‌గా లేదు. అదొక 'నర్డ్ కార్' (బోరింగ్ కారు)" అంటూ తిరస్కరించాడని క్యూబన్ స్వయంగా తెలిపారు. కుమారుడి వ్యాఖ్యకు క్యూబన్ నవ్వుతూ "నిజమే" అన్నట్లుగా అంగీకరించడం విశేషం.

మార్క్ క్యూబన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై తరచూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ ఏడాది ఆరంభంలో "క్లబ్ షే షే" అనే మరో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ఎలాన్ మస్క్ "చాలా సున్నిత మనస్తత్వం (థిన్ స్కిన్) కలవాడని, అందుకే ఆయన్ను రెచ్చగొట్టడం తనకు సరదాగా అనిపిస్తుందని" బహిరంగంగానే అంగీకరించారు. అంతకుముందు మరో ఇంటర్వ్యూలో, "ఎలాన్ మస్క్‌ను ఇబ్బంది పెట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నిజంగా అర్హమైనప్పుడు మాత్రమే అలా చేస్తాను" అని క్యూబన్ వ్యాఖ్యానించారు. గతేడాది, ఎక్స్ (గతంలో ట్విట్టర్) సామాజిక మాధ్యమంలో మరింత సానుకూలమైన, అందమైన లేదా విజ్ఞానదాయకమైన కంటెంట్ పోస్ట్ చేయాలని మస్క్ తన యూజర్లను కోరగా, క్యూబన్ వెంటనే "ముందు నువ్వు చెయ్" అంటూ ఘాటుగా స్పందించారు.

ఇటీవల క్యూబన్, గతంలో లాస్ వెగాస్‌లో జరిగిన ఓ ప్రధాన టెక్నాలజీ ట్రేడ్ షో అయిన కామ్‌డెక్స్‌లో జరిగిన ఓ సరదా సంఘటనను కూడా పంచుకున్నారు. ఆ కార్యక్రమంలో తాను కొంతమంది యువతులతో మాట్లాడుతుండగా, వారు అకస్మాత్తుగా అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, అప్పుడే మైక్రోసాఫ్ట్‌ను పబ్లిక్‌గా మార్చి టెక్ ఐకాన్‌గా ఎదుగుతున్న బిల్ గేట్స్‌తో వారు వెళ్లిపోయారని చెప్పారు. బిల్ గేట్స్ "తన అమ్మాయిలను ఎగరేసుకుపోయాడు" అంటూ క్యూబన్ ఆనాటి సంఘటనను నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
Mark Cuban
Kia EV6
Tesla
Elon Musk
Electric Vehicles
Car Preference
Technology Investor
Comdex
Bill Gates
Car Review

More Telugu News