Rishabh Pant: సెంచ‌రీ సంబ‌రం.. శ‌త‌కం త‌ర్వాత పంత్ వెరైటీ సెల‌బ్రేష‌న్స్‌.. వీడియో వైర‌ల్‌!

Rishabh Pant Century Celebration Viral Video
  • ఆర్‌సీబీతో ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో పంత్ అజేయ శత‌కం
  • సెంచ‌రీ త‌ర్వాత గాలిలో ప‌ల్టీ కొడుతూ వెరైటీ సెల‌బ్రేష‌న్స్ 
  • 61 బంతుల్లో 118 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన పంత్‌
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) చ‌రిత్ర‌లోనే యువ ఆట‌గాడు రిష‌బ్ పంత్‌కు ఈసారి అత్య‌ధిక ధ‌ర (రూ.27కోట్లు). పైగా కెప్టెన్సీ కూడా. దాంతో అత‌డిపై భారీ అంచ‌నాలు. కానీ, పంత్ వాటిని అందుకోలేక ఘోర వైఫ‌ల్యంతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. అయితే, మంగ‌ళ‌వారం సొంత మైదానం ఎకానా స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)తో జ‌రిగిన ఐపీఎల్ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ల‌క్నో బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ శ‌త‌కంతో చెల‌రేగాడు. 

కేవ‌లం 54 బంతుల్లో అత‌ను సెంచ‌రీ బాదాడు. ఈసారి ఐపీఎల్‌లో పెద్ద‌గా ఫామ్‌లో లేని పంత్‌.. లీగ్ చివ‌రి మ్యాచ్‌లో మాత్రం త‌న స్ట్రోక్ ప్లేతో అభిమానుల‌ను అల‌రించాడు. శ‌త‌కం పూర్తి కాగానే బ్యాట్‌ను, హెల్మెట్‌ను ప‌క్క‌న ప‌డేసి.. గాలిలో ప‌ల్టీ కొడుతూ వెరైటీ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. జిమ్నాస్ట్ త‌ర‌హాలో గాలిలో ఎగిరి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. 

నిజానికి ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో పంత్ త‌న బ్యాటింగ్ ప‌వ‌ర్ చూపించ‌లేక‌పోయాడు. ఎట్ట‌కేల‌కు లాస్ట్ మ్యాచ్‌లో సెంచ‌రీతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు. వింటేజ్ పంత్ అంటే ఏంటో చూపించాడు. ఈ మ్యాచ్‌లో సిక్స‌ర్లు, ఫోర్ల‌తో ఆకాశ‌మే హ‌ద్దుగా రెచ్చిపోయాడు. 61 బంతుల్లో 118 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సెంచ‌రీ త‌ర్వాత పంత్ ఒక రేంజ్‌లో సెల‌బ్రేట్ చేసుకున్నాడు. 

ఇక‌, పంత్ సెంచ‌రీ చేసినా ల‌క్నో జ‌ట్టుకు విజ‌యం మాత్రం ద‌క్క‌లేదు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఎల్ఎస్‌జీకి... రిషబ్‌ పంత్‌ (61 బంతుల్లో 118 నాటౌట్‌, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగగా, మిచెల్‌ మార్ష్‌ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ భారీ ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ మ‌రో 8 బంతులు మిగిలి ఉండ‌గానే టార్గెట్‌ను అందుకుంది. 

ఆఖ‌ర్లో జితేశ్ శ‌ర్మ మెరుపు బ్యాటింగ్ బెంగ‌ళూరుకు సూప‌ర్ విక్ట‌రీని అందించింది. జితేశ్ 33 బంతుల్లోనే ఏకంగా 85 ర‌న్స్ చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి దూసుకెళ్లిన బెంగ‌ళూరు.. క్వాలిఫ‌య‌ర్‌-1లో ఈ నెల 29న పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో త‌ల‌ప‌డ‌నుంది. ఇందులో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు వెళ్తుంది. 
Rishabh Pant
Rishabh Pant century
Lucknow Super Giants
Royal Challengers Bangalore
IPL 2024
T20 cricket
Jitesh Sharma
Mitchell Marsh
Ekana Stadium
Cricket

More Telugu News