KCR: కాళేశ్వరంపై విచారణ.. జూన్ 5న కమిషన్ ముందుకు కేసీఆర్

KCR to Appear Before Kaleshwaram Inquiry Commission on June 5
  • రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చలు
  • ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావుతో సమావేశమైన కేసీఆర్
  • జూన్ 9న విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పలు దఫాలుగా రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి, వారి సలహాలు స్వీకరించిన అనంతరం జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆయన నిర్ణయించినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇప్పటికే వందకు పైగా అధికారులు, ఇతర వ్యక్తులను విచారించింది. వారిలో చాలామంది, అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నామని కమిషన్‌కు తెలియజేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసి, వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హరీశ్‌ రావు, ఈటల రాజేందర్ విచారణకు హాజరవుతామని ఇప్పటికే స్పష్టం చేయగా, కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో విద్యుత్ అవకతవకలపై నియమించిన కమిషన్ నోటీసులిచ్చినప్పుడు కేసీఆర్ న్యాయస్థానాలను ఆశ్రయించి, సుప్రీంకోర్టు నుంచి ఊరట పొంది విచారణకు హాజరుకాని నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విషయంలో ఆయన వైఖరిపై సందిగ్ధత ఏర్పడింది.

అయితే, ఈసారి విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన ఇప్పటికే రెండుసార్లు ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావుతో, ఒకసారి కేటీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కమిషన్ నోటీసులకు ఎలా స్పందించాలి? విచారణ సమయంలో అడిగే ప్రశ్నలకు మౌఖికంగానా లేక లిఖితపూర్వకంగానా.. ఎలా సమాధానాలు ఇవ్వాలనే అంశాలపై వారు సమాలోచనలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరైన రిటైర్డ్‌ ఇంజనీర్లతోనూ కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది.

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులపై కేసీఆర్ పూర్తిస్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. విజిలెన్స్‌ నివేదికలోని అంశాలు, ఎక్కడ లోపాలు జరిగాయి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఏం చెప్పింది? నిర్మాణ సంస్థలు కమిషన్‌కు ఎలాంటి సమాచారం ఇచ్చాయి? సమస్యలు తలెత్తడానికి గల ప్రధాన కారణాలు ఏమిటనే కోణంలో ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు, దేశంలోని ఇతర ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్నవాటికి సంబంధించిన వివరాలను కూడా ఆయన సేకరించినట్లు సమాచారం. కాగా, మాజీ మంత్రి హరీశ్‌ రావు జూన్‌ 9న కమిషన్‌ విచారణకు హాజరుకానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
KCR
Kaleshwaram Project
Medigadda Barrage
PC Ghosh Commission
Harish Rao
Etela Rajender
Telangana Irrigation
Barrage Collapse
BRS Party
Justice Commission

More Telugu News