NTR: మహానాడులో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఏఐ స్పీచ్

Nandamuri Taraka Rama Rao AI Speech at TDP Mahanadu
  • మహానాడులో ఏఐ రూపంలో ఎన్టీఆర్ ప్రసంగం
  • పార్టీ ఆవిర్భావం, పథకాలపై మాట్లాడిన ఎన్టీఆర్ ఏఐ
  • చంద్రబాబు పాలన, లోకేశ్ సేవలను ప్రశంసించిన ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కడపలో ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102వ జయంతిని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సభా ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ద్వారా ఎన్టీఆర్ ప్రసంగించడం సభికులను విశేషంగా ఆకట్టుకుంది.

"మహా వేడుకలా, పసుపుమయమై జరుగుతున్న ఈ మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న మన బిడ్డలకు, వివిధ రంగాలలో ప్రతిభ చూపిస్తున్న కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా నా పసుపు జెండాను గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి" అంటూ ఏఐ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "సరిగ్గా 43 ఏళ్లు అయ్యింది నా తెలుగువారి కోసం, నా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాను అనేకంటే, పుట్టిందని చెప్పడమే సరైంది" అని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన పథకాలు, సాధించిన అభివృద్ధి గురించి ఏఐ ఎన్టీఆర్ ప్రస్తావించారు. తాను ప్రారంభించిన పథకాలను గుర్తుచేస్తూ, చంద్రబాబు నాయకత్వంలో రూపుదిద్దుకున్న ప్రస్తుత సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు.

అంతేకాకుండా, "మానవసేవలో పార్టీ కార్యకర్తలు, సామాన్యులకు అండగా ఉంటున్న నా మనవడు లోకేశ్ ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. భళా మనవడా.. భళా" అంటూ నారా లోకేశ్ ను అభినందించారు. ఈ ఏఐ ప్రసంగం మహానాడుకు హాజరైన ప్రతినిధులు, కార్యకర్తలను ఎంతగానో ఉత్తేజపరిచింది.
NTR
Nandamuri Taraka Rama Rao
TDP Mahanadu
AI Speech
Chandrababu Naidu
Nara Lokesh
Telugu Desam Party
Andhra Pradesh Politics
Artificial Intelligence
Telugu People

More Telugu News