Atti Satyanarayana: దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ తీవ్ర విమర్శలు

Atti Satyanarayana Responds to Dil Rajus Allegations
  • థియేటర్ల వివాదంలోకి దిల్ రాజు తన పేరును లాగారన్న అత్తి సత్యనారాయణ
  • తమ్ముడిని కాపాడేందుకు తనపై నింద మోపారని మండిపాటు
  • దిల్ రాజు ఆస్కార్ స్థాయిలో నటిస్తున్నారని విమర్శ
థియేటర్ల బంద్‌కు తానే సూత్రధారిని అంటూ నిర్మాత దిల్ రాజు చేసిన ఆరోపణలపై జనసేన పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అత్తి సత్యనారాయణ (అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ) తీవ్రంగా స్పందించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దిల్ రాజు తనపై దురుద్దేశంతోనే ఆరోపణలు చేశారని అన్నారు. ఆయన సోదరుడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికే దిల్ రాజు తన పేరును ఈ వివాదంలోకి లాగారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు.

"థియేటర్ల బంద్ అని నేను ఎక్కడా ప్రకటించలేదు. సినిమాలు లేకపోవడం వల్ల థియేటర్లు మూతపడే పరిస్థితి వస్తుందని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాత్రమే చెప్పాను" అని సత్యనారాయణ వివరణ ఇచ్చారు. జూన్ 1న థియేటర్ల బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డేనని ఆయన స్పష్టం చేశారు. "ఆయన తమ్ముడిని కాపాడుకోవడం కోసమే దిల్ రాజు నా మీద ఈ నిందలు వేశారు. పవన్ కల్యాణ్ గారు హెచ్చరించడంతోనే దిల్ రాజు జనసేన పార్టీ పేరును ప్రస్తావించారు. కమలహాసన్‌ను మించిపోయేలా దిల్ రాజు ఆస్కార్ స్థాయిలో నటించారు" అంటూ అత్తి సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

సోమవారం నాడు హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత దిల్ రాజు, థియేటర్ల బంద్‌కు అత్తి సత్యనారాయణ కారణమని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు జనసేన పార్టీలో కలకలం రేపాయి. దీనిపై తక్షణమే స్పందించిన జనసేన అధిష్ఠానం... అత్తి సత్యనారాయణను రాజమండ్రి సిటీ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
Atti Satyanarayana
Dil Raju
Shirish Reddy
Theater strike
Janasena Party
Rajamundry
Telugu cinema
Movie theaters
Andhra Pradesh politics
Film producer

More Telugu News