Vikas Mehta: సెప్టిక్ ట్యాంక్‌లో బంగారు వ్యర్థాల కోసం వేట.. నలుగురు బలి!

Vikas Mehta 4 Dead in Jaipur Septic Tank Gold Waste Retrieval
  • జైపూర్‌లో విషాదం
  • బంగారం వ్యర్థాల కోసం సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన కూలీలు
  • ఊపిరాడక ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు మృతి
  • మరో నలుగురికి తీవ్ర అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స
  • షాపు యజమాని, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగల దుకాణానికి చెందిన సెప్టిక్‌ ట్యాంక్‌లో పేరుకుపోయిన బంగారు వ్యర్థాలను వెలికితీసే ప్రయత్నంలో నలుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జైపూర్‌లోని ఓ జ్యుయెలరీ దుకాణం యజమాని వికాస్ మెహతా, బంగారం, వెండి ఆభరణాల తయారీలో వ్యర్థ పదార్థం సెప్టిక్ ట్యాంక్‌లో పేరుకుపోయిందని గుర్తించారు. దానిని తీయడానికి సోమవారం ఎనిమిది మంది కూలీలను సంప్రదించారు. అయితే, కూలీలు మొదట నిరాకరించగా, బంగారు వ్యర్థాల తీస్తే అదనంగా డబ్బులిస్తానని యజమాని చెప్పడంతో వారు అంగీకరించారు.

ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండానే కూలీలు సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగారు. ట్యాంక్‌లో విషవాయువుల వెలువడటంతో ఎనిమిది మంది కార్మికులు స్పృహతప్పి పడిపోయారు. వారిని వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే నలుగురు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్ పాల్, సంజీవ్ పాల్, హిమాంగ్షు సింగ్, అర్పిత్ యాదవ్‌లుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా కార్మికులను ప్రమాదకరమైన సెప్టిక్ ట్యాంక్‌లోకి పంపిన ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆ సెప్టిక్ ట్యాంక్‌లో నిజంగానే బంగారు వ్యర్థాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆభరణాల దుకాణం యజమాని వికాస్ మెహతా, సంబంధిత కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ దుర్ఘటనపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులు సెప్టిక్ ట్యాంకుల్లోకి దిగి మరణిస్తున్న ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Vikas Mehta
Jaipur
Rajasthan
septic tank
gold waste
jewelry shop
laborers death

More Telugu News