Kuna Srisailam Goud: రూ.50 లక్షల కోసం మాజీ ఎమ్మెల్యే బంధువుకు బెదిరింపు: అద్దెకుంటున్న వ్యక్తే కీలక సూత్రధారి!

Extortion Threat to Ex MLA Relative Masterminded by Tenant
  • షాపూర్‌నగర్‌లో మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ సంచలనం
  • మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడికి  బెదిరింపు.... రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్
  • బాధితుడి ఇంట్లో అద్దెకుంటున్న రాజు, అతడి స్నేహితుడి అరెస్ట్
  • నిందితుల నుంచి నాటు బాంబులు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
  • విజయనగరం నుంచి నాటు బాంబులు తెచ్చినట్లు వెల్లడి
మేడ్చల్ జిల్లా షాపూర్‌నగర్‌లో మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులను జీడిమెట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి నాటు బాంబులు, మూడు సెల్ ఫోన్లు, రెండు బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపు ఘటన ఈ నెల 21న చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, షాపూర్‌నగర్‌కు చెందిన కూన రాఘవేందర్‌ గౌడ్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజు అనే వ్యక్తి, అతని స్నేహితుడు కలిసి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రాఘవేందర్ గౌడ్, మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ సోదరుడైన కూన రవీందర్ గౌడ్ కుమారుడు. రాఘవేందర్‌ గౌడ్‌ను చంపేస్తామని, రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టుల పేరుతో నిందితులు లేఖ రాశారు. అంతేకాకుండా, రెండు ఇళ్లను బాంబులతో పేల్చివేస్తామని కూడా ఆ లేఖలో హెచ్చరించారు.

ఈ నెల 21న, గుర్తుతెలియని వ్యక్తి రాఘవేందర్‌ గౌడ్ ఇంటి ముందు కొన్ని వస్తువులను ధ్వంసం చేసి, కారుపై ఎరుపు రంగు టవల్‌లో చుట్టిన ఓ లేఖను వదిలి వెళ్లాడు. ఈ ఘటనపై రాఘవేందర్‌ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, ఒక వ్యక్తి ముసుగు ధరించి వచ్చి ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు.

పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేసి, కూన రాఘవేందర్ గౌడ్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజు ప్రమేయాన్ని గుర్తించారు. అతడితో పాటు అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారు నాటు బాంబులను విజయనగరంలో కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Kuna Srisailam Goud
Shapurnagar
Extortion
Maoists
Bomb threat
Ransom

More Telugu News