Chandrababu Naidu: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: మహానాడులో టీడీపీ నేతల ప్రసంగాలు

Chandrababu Naidu TDP Leaders Focus on Development and Welfare at Mahanadu
  • కడపలో టీడీపీ మహానాడు
  • నేడు రెండో రోజు కొనసాగిన కార్యక్రమం
  • ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించిన టీడీపీ నేతలు
కడప వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ముఖ్య నేతలు రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గత వైసీపీ ఐదేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యుత్, సాగునీరు, శాంతిభద్రతలు, సంక్షేమ పథకాల అమలు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి పలు కీలక అంశాలపై తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి విద్యుత్ రంగం కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్‌దేనని, 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. అయితే, 2019-24 మధ్య కాలంలో విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేయడమే కాకుండా, 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.1.29 లక్షల కోట్ల భారం మోపారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యుత్ వ్యవస్థ నుంచే 5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ సంస్కరణలకు చంద్రబాబు దేశానికే రోల్ మోడల్ అని, ఆయన పాలనలోనే 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చిందని విమర్శించారు.

ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2014-19 మధ్య రూ.72 వేల కోట్లు నీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే, గత ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌లో కేవలం రూ.32 వేల కోట్లే కేటాయించిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో 72 శాతం పూర్తి చేస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందని, డయాఫ్రమ్ వాల్‌ను ధ్వంసం చేసిందని ఆరోపించారు. 2025 డిసెంబర్‌కు డయాఫ్రమ్ వాల్, 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర, రాయలసీమలకు నీరందిస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే గత ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారని, తాము 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి తమ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే రూ.1,100 కోట్లు కేటాయించిందని, పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులకు రూ.1200 కోట్లు కేటాయించి 2025 కల్లా విశాఖకు తాగునీరు అందిస్తామని వివరించారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రైతాంగం గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులను చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని, తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే హంద్రీనీవాకు రూ.3,800 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం రాయలసీమ నీటిపారుదల వ్యవస్థను నాశనం చేసిందని, పులివెందులకు కూడా టీడీపీనే నీరిచ్చిందని పేర్కొన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని, దీనికోసం చంద్రబాబు పోలవరం-బనకచర్ల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని వివరించారు.

మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, సభలు, ధర్నాలకు అనుమతులు నిరాకరించడం వంటి చర్యలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని, అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ఎన్నో ఆటంకాలు సృష్టించారని, రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేక చట్టాలు తెచ్చిందని, గంజాయి నియంత్రణకు యాంటీ నార్కొటిక్స్, ఈగల్ వంటి విభాగాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ, రాజమండ్రి మహానాడు నుంచి చంద్రబాబు సంక్షేమ విప్లవానికి నాంది పలికారని, సూపర్ 6 పథకాలకు ప్రజలు భరోసా ఇచ్చారని అన్నారు. దీపం-2 పథకాన్ని గత ఏడాది నవంబర్ 1న, తల్లివందనం, అన్నదాత సుఖీభవ పథకాలను జూన్ 12న అమలు చేయనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతితో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో శాంతి పవనాలు వీచాయని, గత పాలనలో అరాచకాలు జరిగాయని విమర్శించారు. అమరావతికి 500 ఎకరాలు చాలంటూ జగన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ఆరోపించారు.

ఎంపీ భరత్ మాట్లాడుతూ, కడప గండికోట వంటి ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటకాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు చూస్తున్నారని, పర్యాటక రంగంలో 2 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని అన్నారు. గత ప్రభుత్వం అరకు కాఫీని అరకు డ్రగ్స్‌గా మార్చిందని, రుషికొండను బోడిగుండు చేసిందని విమర్శించారు.

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రాజకీయ సభలో యోగాపై తీర్మానం చేయడం అరుదైన సంఘటన అని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షిస్తారని తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించనున్నట్లు చెప్పారు.

శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, టీడీపీ ఒక సేవా సంస్థ అని, ఎన్టీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు నడుస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిందని, కూటమి ప్రభుత్వం మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని తెలిపారు.


Chandrababu Naidu
TDP Mahanadu
Andhra Pradesh
AP Politics
Polavaram Project
Irrigation Projects
Electricity Sector
Employment Opportunities
Welfare Schemes
Nara Lokesh

More Telugu News