YS Jagan: టీడీపీ మహానాడుపై జగన్ కామెంట్స్

YS Jagan Comments on TDP Mahanadu as Drama
  • మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారన్న వైఎస్ జగన్
  • కడపలో మహానాడు నిర్వహించడం, తనను తిట్టడం హీరోయిజం కాదన్న జగన్
  • హీరోయిజం అంటే ఎన్నికల హామీలను నేరవేర్చడం, అది చంద్రబాబు వల్ల కాదన్న జగన్
మహానాడు ఒక పెద్ద డ్రామా అని, చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామాల పార్టీ అని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారని, రాష్ట్రంలో ఏ ఇంటికైనా ఆ పార్టీ నేతలు వెళ్లి తాము ఈ పని చేశామని ధైర్యంగా చెప్పుకోగలరా అని జగన్ ప్రశ్నించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కడపలో మహానాడు నిర్వహించడం హీరోయిజం కాదని, తనను తిట్టడం అంతకన్నా హీరోయిజం కాదని అన్నారు. హీరోయిజం అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడమేనని, వాటిని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు.

సూపర్ సిక్స్, సెవెన్ పథకాలను గాలికి వదిలివేశారని, 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని అన్నారు. గ్యాస్ సిలెండర్లను సరిగా ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు అటకెక్కాయని, సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు, పిల్లల ట్యాబ్‌లు అన్నీ ఆగిపోయాయని మండిపడ్డారు.

తమ హయాంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వగా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన సరిగ్గా లేవని, చదివించుకోలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులున్నాయని తెలిపారు. అమ్మఒడి పథకానికి మంగళం పాడారని అన్నారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని, రోగులకు ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

ధాన్యానికి కనీస మద్దతు ధర లేదని, రైతుల బతుకులు దళారుల పాలయ్యాయని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో తాము రూ.2.73 కోట్లు డీబీటీ చేశామని, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారని జగన్ ప్రశ్నించారు. 
YS Jagan
TDP Mahanadu
Chandrababu Naidu
YSRCP
Andhra Pradesh Politics
Super Six Schemes
Fee Reimbursement
Amma Vodi
Health Schemes
Farmer Support Price

More Telugu News