Geeta Ahir: ప్రియుడితో పారిపోయేందుకు వివాహిత ఘాతుకం.. బెడిసికొట్టిన 'దృశ్యం' ప్లాన్

Geeta Ahir Married Womans Crime Fails Drushyam Plan
  • గుజరాత్‌లోని పాటన్ జిల్లాలో ఘటన
  • 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో హత్యకు ప్రణాళిక
  • అమాయకుడిని చంపి, తానే మరణించినట్టు నాటకం
  • ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయిన జంట
  • జోధ్‌పుర్‌ పారిపోతుండగా పాలన్‌పుర్‌లో అరెస్ట్
ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలన్న కోరికతో ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. తాను పారిపోయినా తన కోసం ఎవరూ వెతక్కుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ రచించింది. అయినప్పటికీ దొరికిపోయి ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. గుజరాత్‌లోని పాటన్‌ జిల్లా, సంతాల్‌పుర్‌ తాలూకా పరిధిలోని జఖోట్రా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. జఖోట్రా గ్రామానికి చెందిన గీతా అహిర్‌ (22) అనే వివాహిత, భరత్‌ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా భరత్‌తో కలిసి రాజస్థాన్‌కు పారిపోయి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించాలని ఓ ప్లాన్ వేసింది. ఈ ప్లాన్‌ను ప్రియుడు భరత్‌కు వివరించింది.

పథకం ప్రకారం భరత్‌ మంగళవారం రాత్రి సమయంలో ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్‌ సోలంకీ (56) అనే వ్యక్తిని అడ్డగించి హత్య చేశాడు. అనంతరం, ముందుగా అనుకున్నట్లుగా హర్జీభాయ్‌ మృతదేహాన్ని జఖోట్రా గ్రామ శివార్లలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తరలించాడు. అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక గీత బయటకు వచ్చింది. తాను చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రియుడు భరత్‌తో కలిసి హర్జీభాయ్‌ శవానికి తన బట్టలు వేసి, కాళ్లకు గజ్జెలు తొడిగింది. అనంతరం శవంపై పెట్రోలు పోసి నిప్పంటించి, ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. తన మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు ఇక తన కోసం వెతకరని గీత భావించింది.

అయితే, అర్ధరాత్రి ఇంట్లో గీత కనిపించకపోవడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెతకడం ప్రారంభించారు. గ్రామ శివార్లలోని కుంట సమీపంలో సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి, అది గీతదేనని తొలుత భావించారు. కానీ, కాస్త పరిశీలనగా చూడగా అది పురుషుడి శవంగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాలు, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో గీత, భరత్‌లు జోధ్‌పుర్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. పాలన్‌పుర్‌ రైల్వే స్టేషన్‌లో జోధ్‌పుర్‌ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాల్లోని సన్నివేశాల నుంచి స్ఫూర్తి పొంది ఈ హత్యకు పథకం రచించినట్లు గీత పోలీసుల ఎదుట అంగీకరించింది. నిందితులిద్దరినీ అరెస్టు చేసి, వారిపై హత్య, సాక్ష్యాలు తారుమారు చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Geeta Ahir
Gujarat crime
extra marital affair
murder plot
Drushyam movie
lover elopement
Rajasthan
patan district
police investigation

More Telugu News