Sequent Scientific: సీక్వెంట్, వియాష్‌ల విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం

Sequent Scientific Viyash Life Sciences Merger Gets Stock Exchange Approval
  • సీసీఐ ఆమోదం తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి నిరభ్యంతర పత్రాల జారీ
  •  నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అనుమతి మాత్రమే  తరువాయి
  •  గత ఆర్థిక సంవత్సరంలో రెండు కంపెనీల ఉమ్మడి ఆదాయం రూ.3009 కోట్లు
  • విలీనంతో పరిశోధన, ఉత్పత్తిలో వృద్ధి, రుణ భారం తగ్గుతుందని అంచనా 
జంతు ఆరోగ్య ఔషధాల తయారీలో ఉన్న సీక్వెంట్‌ సైంటిఫిక్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీఐ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్) ఔషధాల సంస్థ వియాష్‌ లైఫ్‌ సైన్సెస్‌ల విలీన ప్రక్రియ ఏడాదిలోగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసిపోయేందుకు ఇప్పటికే కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నుంచి అనుమతి లభించింది. తాజాగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) 'అబ్జర్వేషన్‌ లెటర్‌' ఇవ్వగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) 'నో అబ్జెక్షన్‌' లెటర్‌ను జారీ చేసింది. దీంతో విలీన ప్రక్రియలో కీలక అడుగు పడినట్లయింది. తదుపరి అనుమతి కోసం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముందు దరఖాస్తు చేయనున్నారు.

ఈ విలీనం గురించి 2024 సెప్టెంబరులోనే ప్రకటించారు. అప్పుడు, ఈ ప్రక్రియ మొత్తం 12 నుంచి 15 నెలల సమయంలో పూర్తవుతుందని కంపెనీలు తెలిపాయి. అనుకున్న ప్రణాళిక ప్రకారమే పనులు జరుగుతున్నాయని సీక్వెంట్‌ సైంటిఫిక్‌ యాజమాన్యం ఇటీవల వెల్లడించింది.

ఆర్థిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన
విలీనం కానున్న ఈ రెండు కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం (2024-25) మొత్తానికి, అలాగే జనవరి-మార్చి త్రైమాసికానికి కూడా ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. సీక్వెంట్‌ సైంటిఫిక్‌ మార్చి త్రైమాసికంలో రూ.401 కోట్ల ఆదాయంపై రూ.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. పూర్తి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ ఆదాయం రూ.1551 కోట్లు కాగా, పన్నుల తర్వాత రూ.32 కోట్ల లాభం నమోదైంది. మరోవైపు, వియాష్‌ లైఫ్‌ సైన్సెస్‌ మార్చి త్రైమాసికంలో రూ.370 కోట్ల ఆదాయాన్ని, 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1458 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

రెండు కంపెనీల ఆర్థిక ఫలితాలను కలిపి చూస్తే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.3,009 కోట్లకు చేరగా, నికర లాభం రూ.172 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఈ రెండు కంపెనీల ఉమ్మడి ఆదాయం రూ.2680 కోట్లు, నికర లాభం రూ.59 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే, పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు స్పష్టమవుతోంది.

విలీనంతో ప్రయోజనాలు 
ఈ విలీనం పూర్తయితే పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ఉత్పత్తి విభాగాల్లో వేగంగా వృద్ధి చెందడానికి, అలాగే కంపెనీల రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వీలు కలుగుతుందని సీక్వెంట్‌ సైంటిఫిక్‌ తెలిపింది. రాబోయే రెండేళ్లలో రెండంకెల వృద్ధిని సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా పెంపుడు జంతువుల ఆరోగ్య ఉత్పత్తుల విభాగంలో త్వరితగతిన వృద్ధికి అవకాశాలున్నాయని భావిస్తోంది. ఐరోపా దేశాల్లో కొత్త ఉత్పత్తులు, టీకాలను పెద్దఎత్తున మార్కెట్లోకి తీసుకురావడానికి, లాటిన్‌ అమెరికా దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరించడానికి కూడా సీక్వెంట్ సన్నాహాలు చేస్తోంది.

మరోవైపు, ఏపీఐ ఔషధాలు తయారుచేసే వియాష్‌ లైఫ్‌ సైన్సెస్‌కు ఇప్పటికే 10 పెద్ద జనరిక్‌ ఔషధ కంపెనీల నుంచి కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (సీడీఎంవో) ప్రాజెక్టులు లభించాయి. ఫార్ములేషన్ల విభాగంలో సంక్లిష్టమైన జనరిక్‌ మందుల (కాంప్లెక్స్‌ జనరిక్స్‌) తయారీపై దృష్టి సారించాలని వియాష్ యాజమాన్యం యోచిస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ప్లాంట్‌ ద్వారా అక్కడి ప్రభుత్వ, రక్షణ విభాగాల నుంచి ఔషధాల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టులు లభిస్తాయని కూడా సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Sequent Scientific
Sequent Scientific Viyash Life Sciences Merger
Viyash Life Sciences
Animal Health Pharmaceuticals
API Manufacturing
Stock Exchange Approval
Merger Benefits
Pharmaceutical Industry
CDMO Projects
Generic Drugs

More Telugu News