Naga Vamsi: టీడీపీకి రూ. 25 లక్షల విరాళాన్ని అందించిన టాలీవుడ్ నిర్మాత నాగవంశీ

Tollywood Producer Naga Vamsi Gives Rs 25 Lakh Donation to TDP
  • మహానాడు వేదికగా వెల్లడించిన చంద్రబాబు
  • త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సన్నిహితుడిగా పేరున్న నాగవంశీ
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, యువ నిర్మాత నాగవంశీ తెలుగుదేశం పార్టీకి రూ. 25 లక్షల భారీ విరాళం అందించారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో ఈ ప్రకటన వెలువడింది.

ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ మహానాడును ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కడపలో మహానాడు జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా, పార్టీకి విరాళాలు అందించిన దాతల పేర్లను చంద్రబాబు నాయుడు వేదికపై నుంచి చదివి వినిపించారు. ఈ క్రమంలోనే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ పాతిక లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నాగవంశీ, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే అనేక చిత్రాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగస్వామ్యం ప్రముఖంగా కనిపిస్తుంది. కొన్ని సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య పేరును నిర్మాతల్లో ఒకరిగా, ఆయనకు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ పేరును సహ నిర్మాణ సంస్థగా కూడా పేర్కొనడం గమనించవచ్చు.

కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పనిచేస్తున్న నాగవంశీ, తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది.
Naga Vamsi
Sitara Entertainments
TDP
Telugu Desam Party
Chandrababu Naidu
Tollywood
Trivikram Srinivas
Andhra Pradesh Politics

More Telugu News