Kalvakuntla Kavitha: కేటీఆర్ పేరెత్తకుండా తీవ్రంగా విరుచుకుపడిన కవిత.. కొత్త పార్టీపై స్పందన

Kalvakuntla Kavitha Criticizes KTR Indirectly on BRS Affairs
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజం
  • పార్టీని నడిపే సత్తా లేనివారు తనకు నీతులు చెబుతున్నారని ఘాటు వ్యాఖ్యలు
  • తాను అడ్డుగా ఉన్నాననే కొందరు తనను దూరం పెట్టాలని చూస్తున్నారని ఆరోపణ
  • కాంగ్రెస్ పార్టీతో 2013 తర్వాత తాను మాట్లాడలేదని కవిత స్పష్టీకరణ
  • తాను కూడా కేసీఆర్ లాగే మొండిదాన్నని, ఎవరికీ భయపడనని వ్యాఖ్య
  • వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ట్వీట్లకే పరిమితమైతే ఎలాగని ప్రశ్న
బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పరోక్షంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నానన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె, తాను చివరిసారిగా కాంగ్రెస్‌తో మాట్లాడింది 2013లోనేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు 101 శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

కేటీఆర్‌పై పరోక్ష విమర్శలు

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని చేయకుండా, కేవలం ట్వీట్లకే పరిమితమైతే ఎలా అని కవిత కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పార్టీని నడిపించే సత్తా లేనివారు తనకు నీతులు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. తాను లేఖ ఎందుకు రాశానని అంటున్నారని, గతంలో వంద లేఖలు రాశానని, వాటిని కేసీఆర్ చదివాక ప్రతిసారీ చించివేసేవారని గుర్తు చేసుకున్నారు. ఈసారి తన లేఖ ఎందుకు బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఒక నాయకుడికి నోటీసులు వస్తే లేని హడావుడి, మరో నాయకుడికి ఇస్తే ఎందుకని ఆమె నిలదీశారు. తనపై మద్యం కుంభకోణం విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని చెప్పారని కవిత గుర్తుచేశారు.

నన్ను అణగదొక్కాలని చూస్తున్నారు

తాను పార్టీకి అండగా ఉన్నప్పటికీ కొందరు తనను దూరం పెట్టాలని చూస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా కేసీఆర్ లాగే "తిక్కదాన్ని" అని, ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. తన ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతర్గత విషయాలపై తాను రాసిన లేఖను ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందని నిలదీశారు. పార్టీ చేయాల్సిన పనుల్లో సగం తానే చేస్తున్నానని, కడుపులో బిడ్డను పెట్టుకుని ఊరూరా తిరిగానని ఆమె అన్నారు.

పార్టీ ఫోరంపై అసంతృప్తి

పార్టీ ఫోరంలో మాట్లాడమని అంటున్నారని, ఫోరం లోపల ఏముందని, అందుకే బయట మాట్లాడుతున్నానని కవిత తెలిపారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, తాను ముందొకటి వెనుక మరొకటి మాట్లాడనని అన్నారు. వరంగల్ మీటింగ్ విజయవంతమైందని చెప్పుకునే వారిని చూసి జనం నవ్వుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. "లీకు వీరులను బయటపెట్టమంటే, గ్రీకు వీరుల్లా నాపై విరుచుకుపడుతున్నారు" అని కవిత వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌తో భేటీపై సస్పెన్స్

తాను కేసీఆర్‌ను ఎప్పుడు కలిసేది చెప్పనని, దానికి ఎలాంటి డెడ్‌లైన్ లేదని కవిత తెలిపారు. కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, ఉన్న పార్టీని కేసీఆర్ కాపాడుకుంటే చాలని సూచించారు. కొందరు తామే కేసీఆర్‌ను నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, ఆయనను నడిపించే వారు ఉన్నారా అని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని కవిత వ్యాఖ్యానించారు. పెయిడ్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఎవరి నాయకత్వంలోనూ పని చేసేది లేదని స్పష్టం చేశారు.
Kalvakuntla Kavitha
Kavitha
KTR
BRS Party
Telangana Politics
Internal Conflicts
KCR
Congress Party
BJP Merger

More Telugu News