Vidadala Rajani: చంద్రబాబు పాలనపై విడదల రజని ఫైర్

Rajani Criticizes Chandrababu Neglecting Poor Welfare
  • చంద్రబాబు ఆర్థిక అభివృద్ధి పేరుతో తన వారికి మేలు చేస్తున్నారని విడదల రజని
  • పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శ
  • వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని ఫైర్
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆర్థిక అభివృద్ధి పేరుతో కేవలం ఆయన అనుయాయులకే ప్రయోజనం చేకూరుతోందని, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి విడదల రజని తీవ్రస్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని, ప్రస్తుత చంద్రబాబు పాలనలో ప్రజల ఆశలు అడియాశలయ్యాయని విడదల రజని అన్నారు. "పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో విడుదల కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలను ఇలా పీడించడం తగదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

చంద్రబాబు పాలనలో రైతులు నిరసన బాట పట్టారని, కొత్త పరిశ్రమల ఏర్పాటు ఊసే లేదని రజని ఆరోపించారు. "ఆర్థిక అభివృద్ధి పేరుతో మీ మనుషులకు మేలు చేస్తున్నారు తప్ప, పేదలకు సంక్షేమం అందించాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇప్పుడు ఏ పథకం గురించి అడిగినా పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతి అంటున్నారంటూ" ఆమె మండిపడ్డారు.

జగన్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసి, వైద్య విద్యార్థుల ఆశలను నెరవేర్చాలని చూశారని రజని గుర్తుచేశారు. "కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి, నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని జగన్ గారు భావించారు. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతోంది. ఒక సంస్థతో సర్వే చేయించి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నివేదిక తెప్పించారు. వందల కోట్ల విలువైన ఆస్తులను, ఒక్కో కాలేజీని సంవత్సరానికి కేవలం 5 వేల రూపాయలకు లీజుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?" అని ఆమె ప్రశ్నించారు.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యత నుంచి చంద్రబాబు సర్కారు తప్పుకోవడం సరికాదని విడదల రజని హితవు పలికారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తప్పకుండా సమీక్షిస్తామని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్ జగన్ చేసిన ఏర్పాట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వం నాశనం చేసిందని, దీనివల్ల గిరిజనులకు మళ్లీ డోలీ కష్టాలు తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
Vidadala Rajani
Chandrababu Naidu
YS Jaganmohan Reddy
Andhra Pradesh Politics
Medical Colleges Privatization
Healthcare Andhra Pradesh
AP Government Schemes
TDP Government
YSRCP
Economic Development Andhra Pradesh

More Telugu News