Kalvakuntla Kavitha: మాకు కవిత అవసరం లేదు.. ఆ దెయ్యాలు ఎవరో బయటపెట్టాలి: కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

Kalvakuntla Kavitha Not Needed Exposes Congress MP Kiran Kumar Reddy
  • బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణ
  • లిక్కర్ స్కామ్ నుంచి కవితను రక్షించేందుకే ఈ కుమ్మక్కు అని విమర్శ
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు వెనుక ఇదే కారణమన్న చామల
  • తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని వ్యాఖ్య
  • పదేళ్ల పాలనలో ప్రజాధనం దోచిన వారి వివరాలు కవిత వెల్లడించాలని డిమాండ్
బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణలో రాజకీయ నాటకాలకు తెరలేపాయని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమవుతోందని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కవిత అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.

మద్యం కుంభకోణం కేసు నుంచి కవితను బయటపడేసేందుకే బీజేపీతో బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకుందని తాము ముందు నుంచి భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ వద్ద తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం, రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకోవడం వెనుక ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనే కారణమని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్.. బీజేపీకి మద్దతు ఇచ్చిందని కూడా ఆయన ఆరోపించారు.

ఆ దెయ్యాలు ఎవరో బయటపెట్టాలి

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనాన్ని దోచుకున్న 'దెయ్యాలు' ఎవరో కల్వకుంట్ల కవితకు చిత్తశుద్ధి ఉంటే బహిర్గతం చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. కేవలం లేఖలు రాయడం, మాటలు చెప్పడం ద్వారా కాకుండా, వాస్తవాలను ప్రజల ముందు ఉంచినప్పుడే తెలంగాణ సమాజంలో కవితకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన హితవు పలికారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. అందువల్ల, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడిన వారందరిపై దర్యాప్తు సంస్థలకు కవిత వాంగ్మూలం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

"కేసీఆర్ ఒక్కరే లీడర్" అని కవిత చెప్పడంలో ఆంతర్యం ఏమిటని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి కవిత అవసరం లేదని, తమ పార్టీలో ఎలాంటి నాయకత్వ లోపం లేదని ఒక కాంగ్రెస్ ఎంపీగా తనకు తెలుసని ఆయన స్పష్టం చేశారు.
Kalvakuntla Kavitha
BRS
BJP
Telangana politics
Chama Kiran Kumar Reddy
MLC elections

More Telugu News