Mamata Banerjee: ధైర్యముంటే రేపే ఎన్నికలు నిర్వహించండి.... ప్రధాని మోదీకి సవాల్ విసిరిన మమతా!

Mamata Banerjee Challenges Modi to Hold Bengal Elections Tomorrow
  • పశ్చిమ బెంగాల్ టీఎంసీ ప్రభుత్వం అవినీతిమయం, క్రూరమైనదన్న ప్రధాని మోదీ
  • రాష్ట్రంలో హింస, అరాచకం, నిరుద్యోగం పెరిగాయని విమర్శ
  • ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
  • రేపు ఎన్నికలు నిర్వహించినా మేం రెడీ అంటూ ప్రధానికి సవాల్
  • ఆపరేషన్ సిందూర్‌ను బీజేపీ రాజకీయం చేస్తోందని మమత ఆరోపణ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో, రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలాయి. అలీపుర్‌దువార్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఎంసీ సర్కార్ "క్రూరమైనదని", అవినీతి ఊబిలో కూరుకుపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హింస, అరాచకం, నిరుద్యోగం పెట్రేగిపోయాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ప్రధాని ఆరోపణలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే ఘాటుగా బదులిచ్చారు. ప్రధాని వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయని, ఉగ్రవాదంపై దేశం ఐక్యంగా పోరాడుతున్న తరుణంలో, ఆపరేషన్ సిందూర్ వంటి సున్నితమైన అంశాలను బీజేపీ రాజకీయం చేయడం తగదని మండిపడ్డారు. ధైర్యముంటే రేపే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధానికి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు తన వెంటే ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ముర్షిదాబాద్, మాల్దాలలో జరిగిన మత ఘర్షణలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇవి నిదర్శనమని మోదీ అన్నారు. బెంగాల్ అనేక సంక్షోభాలతో సతమతమవుతోందని, ఉపాధ్యాయ నియామక కుంభకోణం వేలాది కుటుంబాల భవిష్యత్తును నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విషయంలోనూ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. ఉగ్రవాదులకు సిందూరం శక్తిని చూపించామని, పాకిస్థాన్ ఉగ్రవాదానికి మాత్రమే ఆశ్రయం కల్పిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

మరోవైపు, మమతా బెనర్జీ మాట్లాడుతూ, తమది మానవతా ప్రభుత్వమని, బీజేపీ విధానాలు విభజనవాదంతో కూడుకున్నవని ఆరోపించారు. మాల్దా, ముర్షిదాబాద్ అల్లర్లకు బీజేపీనే కారణమని ఆమె ప్రత్యారోపణ చేశారు. ఈ పరస్పర విమర్శలు, సవాళ్లతో బెంగాల్ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి.
Mamata Banerjee
West Bengal Elections
Narendra Modi
TMC
BJP
West Bengal Politics
Ali Purduar
Operation Sindoor
corruption
political challenge

More Telugu News