Etela Rajender: కవిత లేఖపై స్పందించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

Etela Rajender Reacts to Kavithas Letter to KCR
  • కవిత వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేతలు
  • తెలంగాణవాదులను కలవడం నేరం కాదన్న ఈటల రాజేందర్
  • ఫోన్లు ట్యాప్ చేయడం కేసీఆర్ నేర్పించిందేనని ఈటల విమర్శ
  • బీఆర్ఎస్ రెండు, మూడు వర్గాలుగా చీలుతుందన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • కవిత సొంత కుంపటి పెట్టబోతున్నారని మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఈరోజు కూడా కవిత సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం స్పందించారు.

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదని, కానీ నాయకులు, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడం మాత్రం కచ్చితంగా నేరమని ఆయన అన్నారు. ఈ పనులన్నీ కేసీఆర్ నేర్పించినవి కావా? అని ఈటల ప్రశ్నించారు.

"బీజేపీ స్టేట్ ఫైట్ చేస్తుంది తప్ప, స్ట్రీట్ ఫైట్ చేయదు. నీచ రాజకీయాలు మేము చేయబోము" అని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల పాటు కేసీఆర్‌ను నమ్మి ప్రజలు మోసపోయారని, ఆ తర్వాత కాంగ్రెస్‌ను నమ్మి మరోసారి భంగపడ్డారని విమర్శించారు. నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్ అయితే, దాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎదురుపడితే నమస్కారం పెడతానని, అది తన సంస్కారమని ఈటల పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు ఒక ఎంపీగా, మాజీ ఆర్థిక మంత్రిగా తాను తప్పకుండా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ చీలిక ఖాయం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం

బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే చీలిపోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ రెండు లేదా మూడు వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉందని, ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఊహించని షాక్ అని ఆయన అన్నారు. రేపు లేదా ఎల్లుండి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాయబోతున్నారని, ఇది పక్కా సమాచారమని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

గతంలో కవిత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించారని, అందుకు కేసీఆర్ అంగీకరించలేదని ఆయన అన్నారు. దీంతో ఇప్పుడు మరో లేఖ రాసి కవిత సొంత కుంపటి పెట్టుకోబోతున్నారని ఆరోపించారు. కవిత లేఖ బయటకు రాకముందే, పది రోజుల క్రితమే తాను ఈ విషయం చెప్పానని, ఇప్పుడు అదే జరిగిందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలవడం అనేది కవిత అమాయకత్వానికి నిదర్శనమని మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కవిత తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పార్టీ నుంచి బయటకు రాబోతున్నారని జోస్యం చెప్పారు.
Etela Rajender
Kavitha letter
BRS party
KCR
Telangana politics
BJP Telangana

More Telugu News