Meghalaya: మేఘాల‌య‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. హ‌నీమూన్‌కు వెళ్లిన జంట అదృశ్యం!

Honeymoon Couple Missing in Meghalaya
  • వారం గ‌డిచినా ఇంకా జంట‌ ఆచూకీ తెలియ‌ని వైనం
  • మేఘాల‌య ప్ర‌భుత్వం ముమ్మ‌రంగా గాలింపు
  • ఈ మేర‌కు సీఎం కాన్రాడ్ సంగ్మా వీడియో సందేశం
మేఘాల‌య‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కొత్త‌గా పెళ్లైన జంట‌ హ‌నీమూన్‌కు వెళ్లి అదృశ్యమైంది. వారం గ‌డిచినా ఇంకా వారి ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన‌ ఆ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, ఇత‌ర శాఖ‌ల అధికారులు, స్థానికులు ఆ జంట కోసం ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మా వెల్ల‌డించారు. అలాగే ఈ కేసును ప్ర‌త్యేకంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. 

వివ‌రాల్లోకి వెళితే... మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌కి చెందిన ట్రాన్స్‌పోర్టు వ్యాపారి రాజా ర‌ఘువంశీ-సోన‌మ్‌ల‌కు కొత్తగా పెళ్లైంది. ఈ జంట హ‌నీమూన్ కోసం మే 20న మేఘాల‌య వెళ్లారు. చివ‌రిసారిగా సోహ్రా (చిర‌పుంజీ)లో ప‌ర్య‌టించిన వాళ్లు.. ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా పోయారు. అయితే, స్థానికంగా ఓ బైక్‌ను అద్దెకు తీసుకుని కొండ‌ప్రాంతం వైపు వెళ్లిన‌ట్లు స‌మాచారం. అనంత‌రం ఓ ప్రాంతంలో బైక్‌ను వ‌దిలేసి కాలిన‌డ‌క‌న వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. 

ఇక‌, ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న మేఘాల‌య ప్ర‌భుత్వం ముమ్మ‌ర గాలింపు చేప‌ట్టింది. మరోవైపు వారి కుటుంబ స‌భ్యులు కూడా దంప‌తుల ఆచూకీ చెప్పిన వారికి రూ. 5ల‌క్ష‌ల రివార్డును ప్రకటించారు. 

ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సీఎం సంగ్మా మాట్లాడుతూ... "మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చిన నూత‌న దంప‌తుల‌కు సంబంధించి దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వాళ్లు అదృశ్య‌మైన‌ట్లు మాకు స‌మాచారం అందింది. ఎంపీ సీఎం మోహ‌న్ యాద‌వ్ కూడా నాతో మాట్లాడారు. ఆ రాష్ట్ర హోంశాఖ నుంచి కాల్స్ వ‌చ్చాయి. ఆ జంట ఆచూకీ కోసం పోలీసులు, అధికారులే కాకుండా స్థానికులు కూడా ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. దీనిపై రోజు వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షిస్తున్నా" అని ముఖ్య‌మంత్రి ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. 

కాగా, వ‌ర్షాలు ప‌డుతుండటంతో సెర్చ్ ఆప‌రేష‌న్‌కు ఆటంకం క‌లుగుతుంద‌ని సీఎం తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగిస్తున్నామ‌ని, చిర‌పుంజిలో భారీ వ‌ర్షాలు ప‌డుతుండ‌డంతో గాలింపున‌కు అంత‌రాయం క‌లుగుతోంద‌ని వెల్ల‌డించారు.  
Meghalaya
Raja Raghuwanshi
honeymoon couple missing
Sonam
Shillong
Cherrapunji
missing persons case
Madhya Pradesh
tourism
police investigation

More Telugu News