Raja Singh: తెలంగాణ బీజేపీలో మళ్ళీ ముసలం: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Raja Singh Targets Bandi Sanjay Amidst Telangana BJP Conflict
  • బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత వ్యాఖ్యలు నిజమేనన్న రాజాసింగ్
  • కరీంనగర్ నుంచి తనపై యుద్ధం ప్రకటించారన్న గోషామహాల్ ఎమ్మెల్యే
  • తెలంగాణ బీజేపీలో బయటపడ్డ అంతర్గత పోరు
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై, ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి.

హైదరాబాద్‌లో ఈరోజు రాజాసింగ్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌లో తాను అభిప్రాయం వెల్లడించినప్పటి నుంచి కరీంనగర్ కేంద్రంగా తనపై కొందరు యుద్ధం ప్రారంభించారని పరోక్షంగా బండి సంజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మధ్య తలెత్తిన విభేదాలను బండి సంజయ్ చొరవ తీసుకుని పరిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు బండి సంజయ్‌నే లక్ష్యంగా చేసుకుని రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం కమలం పార్టీలో మరోసారి అంతర్గత పోరును స్పష్టం చేస్తోంది.

ఇటీవల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన తాను జైల్లో ఉన్నప్పుడే వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలో ఉన్నంతకాలం అది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే తనను కేసీఆర్‌కు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, కేసీఆరే తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో తాను పనిచేయనని కవిత స్పష్టం చేశారు.

కవిత చేసిన ఈ వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్థించడం గమనార్హం. బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనమవుతుందని కవిత చెప్పిన మాటలు నిజమేనేమో అని అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే మనవాళ్లు ఎప్పుడో బీఆర్‌ఎస్‌తో కలిసిపోయేవారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ నేతలు ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని, దానివల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన గతంలోనూ సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.
Raja Singh
Telangana BJP
Bandi Sanjay
BRS Kavitha
BJP internal conflicts
Telangana politics
BJP BRS alliance
Kishan Reddy
Telangana BJP leaders
Goshamahal MLA

More Telugu News