Chandrababu Naidu: చంద్రబాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శలు

BRS Leader Jagadish Reddy Slams Chandrababus Mahanadu Speech
  • తెలంగాణలో చంద్రబాబు అధ్యాయం 2004లోనే ముగిసిందని వ్యాఖ్య
  • హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశాననడం హాస్యాస్పదమని ఎద్దేవా
  • కేసీఆర్ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం 3.70 లక్షలకు చేరిందని వెల్లడి
మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన కొట్టిపారేశారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న చంద్రబాబు ఆరోపణలను జగదీశ్ రెడ్డి ఖండించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే మహానాడులో తెలంగాణ ప్రస్తావన ఎందుకని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. "2004లోనే తెలంగాణలో చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసింది. అయినా, హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని పదేపదే చెప్పుకోవడం నవ్వు తెప్పిస్తోంది" అని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ అభివృద్ధిని వివరిస్తూ, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోయిందని జగదీశ్ రెడ్డి తెలిపారు. "ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం 1.12 లక్షలు కాగా, కేసీఆర్ నాయకత్వంలో అది 3.70 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కేవలం 2.50 లక్షలు మాత్రమే. మీ పరిపాలన నిజంగా గొప్పదైతే, ఏపీ ఆదాయం ఎందుకు పెరగడం లేదు?" అని చంద్రబాబును జగదీశ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు ఏపీలో జరిగిన అభివృద్ధిని కూడా గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.
Chandrababu Naidu
Jagadish Reddy
BRS
TDP
Telangana
Andhra Pradesh
KCR
Per Capita Income
Mahanadu
Political Criticism

More Telugu News