Kavitha: కేసీఆర్ ను కలిసే అవకాశం వచ్చినా... కలవలేకపోయాను: కవిత

Kavitha Demands Investigation into Letter Leak to KCR
  • కేసీఆర్‌కు రాసిన లేఖ లీకేజీపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్పందన
  • నా జెండా, అజెండా బీఆర్ఎస్సే అంటూ స్పష్టీకరణ
  • బీజేపీతో పొత్తును, బీఆర్ఎస్ ను విలీనం చేసే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడి
తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తీవ్రంగా స్పందించారు. ఈరోజు మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన లేఖ ఎలా బహిర్గతమైందో, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. లేఖ రాయడానికి ముందే కేసీఆర్‌ను కలిసే అవకాశం వచ్చినా, కొన్ని కారణాల వల్ల కలవలేకపోయానని కవిత తెలిపారు. 

"నాకంటూ ప్రత్యేక జెండా గానీ, అజెండా గానీ లేవు. బీఆర్ఎస్ నా పార్టీ, కేసీఆరే నా నాయకుడు" అని కవిత మరోసారి తేల్చిచెప్పారు. పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు. పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు.

బీజేపీతో పొత్తుల అంశంపైనా కవిత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వైపు చూడకూడదని... బీజేపీతో పొత్తు పెట్టుకుని బాగుపడిన పార్టీలు చరిత్రలో లేవు అని ఆమె వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామంటే అస్సలు ఒప్పుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో నెలకొన్న సమస్యలు, పుట్టుకొస్తున్న కోవర్టుల గురించే తాను అధినేతకు లేఖ రాశానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఎన్నో ఆవేదనలు భరించలేకే ఈ లేఖ రాయాల్సి వచ్చిందని తెలిపారు. "నా మీద దృష్టి తగ్గించి, ముందు లేఖను లీక్ చేసిన వారిని పట్టుకోండి" అని పార్టీ అధిష్ఠానానికి ఆమె హితవు పలికారు.
Kavitha
BRS
KCR
Telangana politics
BJP alliance
Letter leak
एमएलसी कविता
KCR leadership
Party unity
Telangana news

More Telugu News