Uttam Kumar Reddy: ప్రభుత్వ ఉద్యోగుల అలసత్వంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్

Uttam Kumar Reddy Fires on Government Employees Negligence
  • సూర్యాపేటలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల పర్యటన
  • ప్రభుత్వమే చివరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టీకరణ
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ
ప్రభుత్వ ఉద్యోగులు పనితీరులో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని, పాలనలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధిక మొత్తంలో వరి ధాన్యం కొనుగోలు చేస్తోందని, చివరి గింజ వరకూ కొంటామని రైతులకు భరోసా ఇచ్చారు. రేషన్లో బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

రాబోయే ఐదేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను డెన్మార్క్ అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో ప్రారంభిస్తామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఉదయ సముద్రం పనులను ఆపేసిందని ఆరోపించారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే కూలిపోయిందని, ఈ ఏడాది కాళేశ్వరం నీళ్లు అవసరం లేకుండానే ఎక్కువ వరి పండిందని పేర్కొన్నారు.

తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు లబ్ధి చేకూరుతుందని, ఎవరూ తొందరపడొద్దని సూచించారు. ఉమ్మడి జిల్లాకు కృష్ణా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని, లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాలు ఆయిల్ పాం సాగుకు అనుకూలంగా ఉందని, అందుకు తగ్గట్టుగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని తుమ్మల వివరించారు. 
Uttam Kumar Reddy
Telangana
Government Employees
Suryapet
Tumma Nageswara Rao
Nalgonda
Irrigation Projects
Paddy Procurement
Kaleshwaram Project
SLBC Tunnel

More Telugu News