Sajjala Ramakrishna Reddy: 'వెన్నుపోటు దినం' కార్యక్రమం... పోస్టర్ ను ఆవిష్కరించిన వైసీపీ

YSRCP launches Vennupotu Dinam poster
  • ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందన్న సజ్జల
  • జూన్ 4న 'వెన్నుపోటు దినం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడి
  • అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్న సజ్జల
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూన్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 'వెన్నుపోటు దినం' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. తాడేపల్లిలోని వై‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి 'వెన్నుపోటు దినం' పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని దుర్మార్గమైన పాలన అందిస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇటువంటి పాలనను ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఈ వైఖరిని ప్రశ్నిస్తూ, వైసీపీ తలపెట్టిన 'వెన్నుపోటు దినం' నిరసన కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని సజ్జల పేర్కొన్నారు.

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తన ఏడాది పాలనలో నిరంకుశ, అరాచక విధానాలను ప్రజలకు పరిచయం చేసిందని సజ్జల విమర్శించారు. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమల్లోకి నెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతోందని, ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసం చేయడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా ఉండేందుకు రాష్ట్రంలో భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చెబుతున్నారని సజ్జల ఎత్తి చూపారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు నింపుతానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, ఇప్పుడు 'పీ-4' అంటూ కొత్త నాటకాలకు తెరతీశారని, పేదరిక నిర్మూలన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 1995లో సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత 1999, 2014, 2024 ఎన్నికల్లోనూ ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టారని విమర్శించారు. గతంలో హామీలను అమలు చేస్తానంటూ అబద్ధాలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బరితెగించి హామీలను అమలు చేయడం కుదరదంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే రాష్ట్రంపై రూ.1.49 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని, ఆ సొమ్మును దేనికి వినియోగించారో తెలియడం లేదని సజ్జల అన్నారు. ఆనాడు మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఈరోజు నేరుగా తనను నమ్మి ఓటు వేసిన ప్రజలనే వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఈ మోసాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ 'వెన్నుపోటు దినం' నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్లి స్థానిక అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తాయని చెప్పారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని, ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు మోసపోయిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, కుంభా రవి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. 
Sajjala Ramakrishna Reddy
Chandrababu Naidu
YSRCP
Vennupotu Dinam
Andhra Pradesh Politics
Election Promises
Government Schemes
Debt Burden
Protest
Telugu News

More Telugu News