Manchu Vishnu: 'కన్నప్ప' హార్డ్‌ డిస్క్‌ మాయం: మనోజ్‌ ఇంట్లోవాళ్ల పనేనన్న మంచు విష్ణు!

Manchu Vishnu Says Manchu Manoj Staff Involved in Kannappa Hard Drive Theft
  • 'కన్నప్ప' సినిమా హార్డ్‌ డిస్క్‌ మాయంపై స్పందించిన మంచు విష్ణు
  • సోదరుడు మనోజ్‌ ఇంట్లో పనిచేసే ఇద్దరిపై అనుమానం వ్యక్తం
  • అది వీఎఫ్‌ఎక్స్‌ డేటా మాత్రమే, పూర్తి సినిమా కాదని వెల్లడి
  • దాదాపు నాలుగు వారాల క్రితం ఘటన జరిగిందని ప్రకటన
  • ఒకవేళ సన్నివేశాలు లీకైనా ప్రోత్సహించవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి
'కన్నప్ప' సినిమాకు సంబంధించిన హార్డ్‌ డిస్క్‌ మాయమైన ఘటనపై ఆ చిత్ర కథానాయకుడు మంచు విష్ణు స్పందించారు. చెన్నైలో జరిగిన సినిమా ప్రచార కార్యక్రమంలో ఈ వివాదంపై ఆయన పెదవి విప్పారు. తన సోదరుడు మంచు మనోజ్‌ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే, వారు స్వయంగా చేశారా, లేక, వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదని విష్ణు పేర్కొన్నారు.

కుటుంబ సమస్యలు అందరికీ ఉంటాయి

ఈ వ్యవహారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంచు విష్ణు సమాధానమిస్తూ, "ఇక్కడ కేవలం ‘కన్నప్ప’ సినిమా గురించే మాట్లాడుకుందాం. దయచేసి కుటుంబ విషయాలపై ప్రశ్నలు అడగవద్దు. అందరి ఇళ్లలోనూ సమస్యలు ఉంటాయి. సాక్షాత్తూ శ్రీరామచంద్రుడి ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి, ఇక నేనెంత?" అని వ్యాఖ్యానించారు.

పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశం తనకు మొదట లేదని, కానీ సోషల్ మీడియాలో లీకుల గురించి పోస్టులు చూశాక, తన తండ్రి మోహన్‌బాబుతో చర్చించి, ఆయన బాధపడటంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని విష్ణు తెలిపారు. "అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురాకపోయినా ఫర్వాలేదు, చెడ్డపేరు మాత్రం తీసుకురాకూడదు అన్నది నా ఫిలాసఫీ" అని ఆయన అన్నారు. మే 18న 'ఎక్స్‌'లో వచ్చిన ఒక పోస్ట్ ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, "కన్నప్ప మూవీ హార్డ్‌ డ్రైవ్‌ లీక్‌ అయింది. అది మనోజ్‌ చేతిలో ఉంటే పరిస్థితి ఏంటి?" అన్నది ఆ పోస్ట్‌ సారాంశమని విష్ణు వివరించారు.

హార్డ్‌ డిస్క్‌లో ఏముంది? ఎలా మాయమైంది?

మాయమైన హార్డ్‌ డిస్క్‌లో 'కన్నప్ప' సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ పూర్తి చేసిన డేటా ఉందని విష్ణు తెలిపారు. "సినిమా డిజిటల్ వెర్షన్‌కు సంబంధించి హాలీవుడ్‌లో మూడు కాపీలు, హైదరాబాద్‌లో రెండు కాపీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న కాపీలు వేర్వేరు కార్లలో ఒకటి డీఐటీ టెక్నీషియన్‌ దగ్గరకు, మరొకటి ఆఫీస్‌కు వెళతాయి. ఇది సాధారణంగా జరిగేదే" అని ఆయన వివరించారు.

కలర్‌ గ్రేడింగ్‌ పనుల కోసం ముంబై నుంచి హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌కు డేటా పంపే క్రమంలో మొదటిసారి ఇబ్బంది రావడంతో, సంబంధిత కంపెనీ హార్డ్‌ డ్రైవ్‌లో సీన్స్‌ను పెట్టి కొరియర్‌ చేసిందని విష్ణు తెలిపారు. "ఆ హార్డ్‌డ్రైవ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌కు గానీ, ఇక్కడ కలర్‌ గ్రేడింగ్‌ చేసే కంపెనీకి గానీ చేరలేదు" అని ఆయన స్పష్టం చేశారు.

సాధారణంగా తమకు రెండు చిరునామాలు ఉంటాయని, ఒకటి ఆఫీస్ అడ్రస్ కాగా, మరొకటి ఫిల్మ్‌ నగర్‌లోని తన తండ్రి ఇంటి జీఎస్టీ రిజిస్ట్రార్ అడ్రస్ అని విష్ణు చెప్పారు. "నాన్నగారి ముగ్గురు పిల్లలకు సంబంధించి ఏది వచ్చినా అక్కడికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు వచ్చిన పేరు బట్టి, ఎవరిది వాళ్లకు అందజేస్తారు. ఇది 15 ఏళ్లుగా జరుగుతోంది. ఇటీవల ఇంట్లో పరిస్థితులు సరిగా లేవన్న విషయం మీకు తెలిసిందే. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీకి కొరియర్‌ వచ్చిన సమయంలో రఘు అనే అతను అక్కడికి వచ్చి ఆ ప్యాకెట్‌ తీసుకుని, చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. ఇది జరిగి నాలుగు వారాలు అయింది" అని విష్ణు వివరించారు. రఘు, చరిత తన సోదరుడు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నారని తాను అనుకుంటున్నానని, మనోజ్ చెప్పి చేయించాడా లేక వాళ్లే చేశారా అనేది తెలియదని అన్నారు.

లీకైనా ప్రోత్సహించవద్దు!

హార్డ్‌డ్రైవ్‌లో ఉన్నది 70 నిమిషాల ఫుటేజ్‌ అని, అది కేవలం వీఎఫ్‌ఎక్స్‌ పనులకు సంబంధించిన డేటా మాత్రమేనని, పూర్తి సినిమా సన్నివేశాలు అందులో లేవని విష్ణు స్పష్టం చేశారు. "దానికి పాస్‌వర్డ్‌ ఉంది. ఏ పాస్‌వర్డ్‌ అయినా 100 శాతం సురక్షితం కాదు, కానీ 99 శాతం ఎవరూ క్రాక్‌ చేయలేరు. మిగిలిన ఒక శాతం మీద అనుమానం ఉంది. ఒకవేళ ఆ సన్నివేశాలు లీక్‌ అయితే, దయచేసి ఆన్‌లైన్‌లో ఎవరూ చూడొద్దని అభిమానులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అది కొన్ని వందల మంది కష్టం. ఆ సన్నివేశాలు లీక్‌ కాకూడదని కోరుకుంటున్నా. ఒకవేళ లీకైనా ఎవరూ దానిని ప్రోత్సహించవద్దు" అని విష్ణు అభ్యర్థించారు.
Manchu Vishnu
Kannappa movie
Manchu Manoj
Hard drive missing
VFX data leak
Telugu cinema
Mohan Babu
Raghu Charitha
24 Frames Factory
Prasad Labs

More Telugu News